CM Jagan Tour : తొమ్మిది రోజుల్లోనే మారిపోయిందా..!?

ABN , First Publish Date - 2021-12-04T07:45:28+05:30 IST

నాడు.. వర్ష బాధితుల్లో ఆవేదన.

CM Jagan Tour : తొమ్మిది రోజుల్లోనే మారిపోయిందా..!?

  • ఎక్కడా, ఏ సమస్యా లేనట్లు సాగిన సీఎం పర్యటన 
  • తిరుపతిలో వర్ష బాధితుల కష్టం, నష్టం అడగని వైనం 


నాడు.. వర్ష బాధితుల్లో ఆవేదన. అడుగడుగునా సమస్యల నివేదన. ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వన్నదే లేదు. యంత్రాలతో పెళ్లగించివేశారా అన్నట్టున్న సిమెంటు రోడ్లు. అడుగుతీసి అడుగు వేయలేనట్టున్న నిలువెత్తు గోతులు. వీధులన్నీ బురదమయం. అడుగేస్తే ఎక్కడ ఏ గొయ్యుందో తెలియని వైనం. సరిగ్గా తొమ్మిది రోజులక్రితం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి పర్యటనకు వచ్చినప్పటి పరిస్థితి ఇది. వరద బీబత్సం.. తదనంతరం ప్రజల కష్టాలకు, నష్టాలకు అద్దం పట్టింది నాటి ఆయన పర్యటన. మీ పరిస్థితి ఏంటంటూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. పరిస్థితులను పరికించి చూస్తూ చంద్రబాబు పర్యటించారు. 


నేడు 

చంద్రబాబు పర్యటించిన అదే ప్రాంతాల్లో శుక్రవారం జగన్‌ కూడా తిరిగారు. వరద బాధితులను పరామర్శించేందుకు నిర్వహించిన సీఎం పర్యటన వరద పరిస్థితులు, బాధితుల గోడు వినకుండానే సాగింది. సుమారు అర కిలోమీటరు పొడవున్న ఓ వీధిలో ముఖ్యమంత్రి కాలినడకన వెళ్లారు. ఈ వీధిని అధికారులు ముందుగానే సుందరీకరించారు. గులకవేసి.. దానిపై కంకర దువ్వ పోసి, బాగా రోలింగ్‌చేసి గతుకనేది లేకుండా మెత్తని రోడ్డును రూపొందించారు అధికారులు. ఆ రోడ్డుపై పర్యటించిన ముఖ్యమంత్రి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ.. అభివాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఎక్కడా వరద కష్టాలు ఏంటనిగాని, నష్టాలు ఏంటనిగాని... మీకేం కావాలని గాని ముఖ్యమంత్రి ఒక్కరినంటే ఒక్కరినీ అడగలేదని బాధితులు అంటున్నారు. ఎక్కడా ఏ సమస్యా లేదన్నట్టు.. జనానికి ఏ ఇబ్బందీ రాలేదన్నట్టు సీఎం పర్యటన కనిపించింది.


ఎందుకిలా..

మరి తొమ్మిది రోజులకే పరిస్థితులు మారిపోయాయా? గోతులన్నీ పూడ్చేశారా? రోడ్లన్నీ వేసేశారా? నాడు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు తొమ్మిదిరోజుల్లో అవన్నీ మర్చిపోయారా? అంటే... అదెంతమాత్రం కాదన్నది నిష్ఠుర సత్యం. మరి ఆ రోజు ఆవేదన చెందినవారు.. సమస్యలను నివేదించిన వారు ఈ రోజు బయటకు రాకపోవడానికి కారణం.. అధికార లీల అనే విమర్శలున్నాయి. తమ సమస్యలపై గళమెత్తకుండా కొందరిని నయాన, మరికొందరిని భయాన బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో వలంటీర్ల కృషి తీవ్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వరద బాధితులను పరామర్శించడానికి కాకుండా.. ఫొటోలు, సెల్ఫీలతో సంబరంగా సాగినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

- తిరుపతి(పద్మావతినగర్‌)

Updated Date - 2021-12-04T07:45:28+05:30 IST