Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 25 May 2022 01:02:33 IST

దశాబ్దాలైనా సాగునీరేదీ?

twitter-iconwatsapp-iconfb-icon
దశాబ్దాలైనా సాగునీరేదీ?

డీ-8, 9 కాల్వల ఆయకట్టు రైతుల ఎదురుచూపు

ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన సీఎం

ముందుకుసాగని పనులు


తిరుమలగిరి(సాగర్‌): ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా డీ-8, 9 కాల్వలతో చివరి భూముల రైతులకు సాగునీరు అందించేందుకు చేసిన ప్రతిపాదనలకు రెం డు దశాబ్దాలు దాటినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఈ కాల్వల ద్వారా పీఏ.పల్లి, పెద్దవూర, తిరుమలగిరి(సాగ ర్‌) మండలాలకు సాగునీరందించేందుకు సుమారు 34కి.మీ మే ర కాల్వలు నిర్మించారు. పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌) మండలాలకు చెందిన భూములు కాల్వ చివర ఉండడంతో ఈ ప్రాంత రైతులు దశాబ్దాలుగా సాగు నీటికోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూటరీ-8, 9 ద్వారా సుమారు 28వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అం దించేందుకు 20ఏళ్ల క్రితం ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదించారు. పీ ఏపల్లి, పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించే లా కోనేటిపురం శివారులోని రంగుండ్ల తండా మీదుగా ఎల్లాపురం తం డా వరకు సుమారు 34కి.మీ మేర మేజర్‌ కాల్వలను సైతం తవ్వారు. అయితే ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల రైతులు డీ-8, 9 కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆరుతడి పంటలకు బదులు వరి సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో పెద్దవూర మండలంలోని పర్వేదుల వరకే ఈ కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది. మిగిలిన పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌) మండలాల్లోని సుమారు 15గ్రామాలకు  చుక్క నీరు చేరక, ఈ ప్రాంత రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.


లోలెవెల్‌ కెనాల్‌ ద్వారా నీరివ్వాలని రైతుల డిమాండ్‌

ఏఎమ్మార్పీ లోలెవెల్‌ కెనాల్‌ ద్వారా పెద్దవూర మండల పరిధిలోని పూల్యాతండా వద్ద మూడు భారీ మోటార్లు ఏర్పాటుచేసి పెద్దవూర, అనుముల, కనగల్‌, నిడమనూరు, వేములపల్లి మండలాల్లోని సుమా రు 50వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 2000 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఇక్కడ మూడు భారీ మోటార్ల ఏర్పాటుచేసి నీటిని లిఫ్ట్‌చేసి సాగునీరందిస్తున్నారు. అయితే ఏకేబీఆర్‌ ప్రాజెక్టు నుంచి డీ-8, 9 చివరి భూములకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో, ప్రత్యామ్నాయంగా లోలెవెల్‌ కెనాల్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలని గతంలో ఇంజనీర్లు ప్రతిపాదించారు. అయితే రెండు దశాబ్దాలుగా ఈ సమస్య అలాగే ఉండగా, దీన్ని పరిష్కరించాల ని ఈ ప్రాంత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2017లో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి సమక్కసారక్క దేవాలయం నుంచి పెద్దవూర మండలం పూల్యాతండా వద్ద ఉన్న లోలెవెల్‌ కెనాల్‌ లిఫ్ట్‌ వరకు రైతులు, కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. అక్కడ సభ ఏర్పాటుచేసి లిఫ్ట్‌ ద్వారా డీ-8, 9 కాల్వలకు నీరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాగార్జునసాగర్‌ అప్పటి ఎమ్మెల్యే జానారెడ్డి పూల్యాతండా ఇంజనీర్లతో సమావేశమై లిఫ్ట్‌ ఏర్పాటుపై సమీక్షించారు. అయినా పనులు ప్రారంభంకాలేదు. 2018లో మంత్రి జగదీ్‌షరెడ్డి రాజవరం చివరి భూముల రైతుల సమస్యలను తెలుసుకునేందుకు తిరుమలగిరి(సాగర్‌) మండలానికి రాగా, శ్రీరాంపల్లి వద్ద ఆయన్ను రైతులు కలిసి ఇబ్బందులు ఏకరువు పెట్టారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు మంత్రి సైతం హామీ ఇచ్చినా ఫలితం లేదు.


లోపించిన చిత్తశుద్ధి

సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలతో పోలిస్తే డీ-8,9 కాల్వలకు నీటిని లిఫ్ట్‌ చేసే పనులు తక్కువ సమయంలో పూర్త య్యే అవకాశం ఉంది. అయినా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లలో చిత్తశుద్ధి లోపించడంతో పనులు నేటికీ పూర్తికాలేదు. లోలెవెల్‌ కెనాల్‌ వద్ద మొత్తం మూడు భారీసైజు మోటార్లు ఉండగా, 1వ నెంబర్‌ మోటార్‌ ద్వారా డీ-8, 9 కాల్వలకు నీటిని అందించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. అందుకు తగ్గట్టు భారీ సంపు(బావి)ను తవ్వించగా, కాంక్రీటు పనులు పూర్తికాలేదు. మోటార్లు ఏర్పాటుచేసిన ప్రాంతం నుంచి సుమారు 550మీటర్ల దూరం వరకు పైపులైన్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. మోటార్‌కు పైపులైన్లను అనుసంధానించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇదిలా ఉండగా, పనుల్లో నాణ్యతలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్‌, సంపు నిర్మాణానికి ఏడాది కాలం పట్టడాన్ని రైతులు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు ఆరు నెలలు కాగా, ఏడాదైనా నేటికీ పనులు పూర్తికాకపోవడం గమనార్హం.


15 గ్రామాల రైతులకు లబ్ధి

డీ-8, 9 కాల్వలకు లిఫ్ట్‌ ద్వారా నీటిని మళ్లిస్తే ఊరబావితండా, చలకుర్తి, చింతపల్లి, కుంకుడుచెట్టు తండా, బోనూతుల, రామన్నగూడెం, తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని కోనేటిపురం, రంగుండ్ల, గాత్‌ తండా, తూటిపేటతండా, పాశంవారిగూడెం, ఎల్లాపురం తండా తదితర గ్రామాల్లోని సుమారు 7,200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రెండు దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కారమవుతుంది.


ఉప ఎన్నికలో ప్రధానాంశంగా డీ-8, 9

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి అనంతరం వచ్చి న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో నెల్లికల్‌ లిఫ్ట్‌తోపాటు, డీ-8, 9 కాల్వలకు సాగునీరందించే విషయం ప్రధాన అంశంగా మారింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అప్పటి పెద్దవూర మండల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్యే బాల్కసుమన్‌ రైతులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో ఖమ్మం జిల్లా దుమ్ముగూ డెం ప్రాజెక్టు నుంచి భారీ సైజు పైపులను ఈ ప్రాంతానికి రప్పించా రు. తిరుమలగిరి(సాగర్‌) మండలానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జీగా వ్యవహరించిన ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సైతం ఈ ప్రాం త రైతులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 2021 ఏప్రిల్‌ 14న సీఎం కేసీఆర్‌ ఎర్రచెర్వుతండా సమీపంలో నెల్లికల్‌ లిఫ్ట్‌, డీ-8, 9 లిఫ్ట్‌తోపాటు మరో 10 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.


పనుల్లో నిర్లక్ష్యం తగదు : కుర్ర శంకర్‌నాయక్‌, సీపీఎం మండల కార్యదర్శి

ఎన్నికల ముందు ఓట్ల కోసం లిఫ్టు ఏర్పాటుచేస్తామని చెప్పడం షరా మామూలైంది. రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులకు పట్టింపులేదు. ఉప ఎన్నిక సమయంలో హడావుడిగా శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ నిర్మాణ పనులు మూడు నెల్లో పూర్తిచేసే అవకాశం ఉన్నా పూర్తిచేయలేకపోయారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పూర్తిచేసి సాగునీరందించాలి.త్వరలోనే పూర్తిచేస్తాం: రవిరాజా, ఇరిగేషన్‌ ఏఈఈ

డీ-8, 9 కాల్వలకు నీరు అందించేందుకు సంపును తవ్వించాం. అక్కడి నుంచి మోటార్‌ వరకు పైపులైన్లను వేసే పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.