Youth earning lakhs: విదేశాల్లో లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి ఇదే పని అని అంతా వెక్కిరించారు.. ఇప్పుడు అతడి సంపాదన చూసి..

ABN , First Publish Date - 2022-09-13T15:39:01+05:30 IST

వ్యవసాయం చేయడం దండగ’అని అనుకుంటారు చాలా మంది. కానీ ఈ మాటలను తప్పని నిరూపించాడు కులదీప్ రాణా.

Youth earning lakhs: విదేశాల్లో లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి ఇదే పని అని అంతా వెక్కిరించారు.. ఇప్పుడు అతడి సంపాదన చూసి..


వయసులో ఉన్న వారికి బోలెడు కలలు ఉంటాయి. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఎదగాలి, కారు, ఇల్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంకు బాలెన్సు ఇలా లిస్ట్‌లో చాలా ఉంటాయి. అవన్నీ తీరాలంటే ఒకటే మార్గం బాగా చదువుకోవాలి, దండిగా డబ్బు సంపాదించాలి. మరీ ముఖ్యంగా ఫారిన్‌కు వెళితే అవన్నీ సులభంగా జరిగిపోతాయి. అందువల్లే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే ఆలోచనలో ఉంటారు యువతీ యువకులంతా. ఇలా కలలు కనే యూత్‌కు అబ్రాడ్ వెళ్లే అవకాశం వస్తే గనుక ఎగిరిగంతేస్తారు. ఇలాంటి కోవకే చెందిన ఒక యువకుడికి అబ్రాడ్ వెళ్లే అవకాశం వస్తే.. వెళ్లినట్టే వెళ్లి మళ్లీ తిరిగొచ్చాడు. అంతేకాదు.. వ్యవసాయం చేస్తానని అన్నాడు. ఆ మాట విన్నవాళ్లందరూ ఫక్కున నవ్వారు. లక్షల కొద్దీ సంపాదన ఇచ్చే ఉద్యోగం వదిలి ఏంటీ పిచ్చి పని అన్నారు. అయినా అతడు ఆ మాటలు లెక్కచేయలేదు.


‘ప్రస్తుతం కాలంలో వ్యవసాయం అనేది అంత లాభదాయకమైన ఆదాయ మార్గం కాదు. రైతులు పంటలు వేసినప్పటి నుండి గండాలు ఎదురవుతూనే ఉంటాయి. విత్తనాలు కానీ మొక్కలు కానీ మంచి నాణ్యతతో ఉన్నవి దొరకవు. ఒకవేళ దొరికితే వాతావరణం అనుకూలించదు. వాతావరణం సహకరిస్తే పంట దిగుబడి ఎలా ఉంటుందో తెలియదు. ఆశించినట్టుగా పంట చేతికి వస్తే మద్దతు ధర ఉండదు. అందుకే వ్యవసాయం చేయడం దండగ’అని అనుకుంటారు చాలా మంది. కానీ ఈ మాటలను తప్పని నిరూపించాడు కులదీప్ రాణా. 


ఇతడు అబ్రాడ్‌లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చి వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదించడమే కాదు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా కూడా నిలిచాడు. కులదీప్ రాణా‌ను చూసి అతడి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారంటే అతడి విజయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 


ఇతను చేసిన వ్యవసాయం ఏమిటి ఎలా చేశాడంటే...

 హర్యానా రాష్ట్రం కర్నల్ ప్రాంతానికి చెందిన కులదీప్ రాణా 2019లో అబ్రాడ్ నుండి తిరిగొచ్చాడు. అర ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలు పెట్టాడు. గడిచిన 3సంవత్సరాలలో ఏటా రూ. 7-8 లక్షల ఆదాయం పొందాడు. అలాగే సాగు విస్తీర్ణాన్ని కూడా రెండెకరాలకు పెంచాడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన మొక్క. దీన్ని భారతదేశంలో కమలం అని పిలుస్తుంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. పైన తొక్క ఎరుపు రంగులో ఉన్నా.. లోపల గువ్వం భాగం తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. ఒక్కో మొక్కకు 8 నుండి 10 కాయలు కాస్తాయి.  


దిగుబడి ధర ఎలా ఉంటాయంటే.....


ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను భూమిలో స్తంభాలు పాతి వాటికి దగ్గరగా నాటుతారు. ఆ మొక్క విస్తరిస్తుంది. ఒక్కొక్క స్తంభం ప్రాంతంలో ఉన్న మొక్కల నుంచి సుమారు 10 నుండి 12 కేజీల డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తాయి. ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ 300 నుండి 400 గ్రాముల బరువుంటుంది. వీటి ధర రూ. 80 -100 మధ్య ఉంటుంది. 

కులదీప్ సాగు చేసిన డ్రాగన్ పంటలో ఇప్పటి వరకు ఎలాంటి తెగులు సోకలేదు. అంతే కాదు ఈ పంటకు వ్యాధుల సమస్య కూడా తక్కువేనట. దీన్ని బట్టి చూస్తే పురుగుల మందులు.. మొదలయిన ఖర్చుల భారం రైతుల మీద చాలా తక్కువ ఉంటుంది. పైగా ఈ పంటకు నీటి వసతి కుడా ఎక్కువ అవసరం లేదు. 


ఒక్కసారి పెట్టుబడితో...

ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఒక సారి పెట్టుబడి పెడితే 25 సంవత్సరాలు దిగుబడి ఇస్తుంది. సంప్రదాయ వ్యవసాయ పంటలలో ఇలాంటి వెసులుబాటు ఉండదు. అందుకే డ్రాగన్ ప్రూట్ సాగు వల్ల రైతులకు మంచి లాభాలు ఉంటాయి. చిన్న చిన్న రైతుల పిల్లలు మంచి సంపాదన కోసం రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్తుంటారు. అలా వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రాగన్  ఫ్రూట్ సాగు చేపడితే ఉన్న ఊళ్ళోనే బోలెడు డబ్బు సంపాదించొచ్చు అని కులదీప్ అంటున్నాడు.


డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు...

డ్రాగన్ ఫ్రూట్‌ను సలాడ్‌లు, షేక్‌లు, జ్యూస్‌లు, జెల్లీలు ఇంకా విభిన్న రకాలుగా ఉపయోగిస్తారు. ఈ పండు ఖరీదైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది కూడా. 

*శరీరంలో చక్కర స్థాయిలు తగ్గించే గుణం ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. 

*కోలస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. 

*యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉన్నందువల్ల క్యాన్సర్‌తో బాధపడేవారికి ఉపయోగకరం.


ఇలా డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తే మంచి లాభాలు ఇస్తుంది. తిన్నామంటే ఆరోగ్యం సొంతమవుతుంది.

Updated Date - 2022-09-13T15:39:01+05:30 IST