రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే సెలెక్ట్.. ఈ యువతి ఇస్రో‌కు ఎలా ఎంపికైందంటే

ABN , First Publish Date - 2021-09-13T17:06:49+05:30 IST

కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదని.. హర్యానాకు చెందిన యువతి మరోసారి నిరూపించింది. చదువులో రాణించి.. అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సదరు యువతిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతోనే సెలెక్ట్.. ఈ యువతి ఇస్రో‌కు ఎలా ఎంపికైందంటే

కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదని.. హర్యానాకు చెందిన యువతి మరోసారి నిరూపించింది. చదువులో రాణించి.. అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సదరు యువతిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కొన్ని పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం ఏటా నోటిఫికేషన్‌ను విడుదల చేసి.. పరిమిత సంఖ్యలో విద్యార్థులను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే ఇస్రో జనవరిలో నోటిఫికేషన్‌ను జారీ చేసి.. దేశ వ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ పది మందిలో చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ(హెచ్ఏయూ)కి చెందిన విద్యార్థిని శివాంశీ యాదవ్ కూడా ఉన్నారు. కాగా.. శివాంశీ.. తన రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో భాగంగా ఏడాదిపాటు ఇస్రోలో విద్యాభ్యాసం చేయనున్నారు. అనంతరం నెథర్లాండ్‌కు వెళ్లి.. అక్కడి ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ ట్వెంటీ ఐటీసీ‌లో తదుపరి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఏయూ పీజీ డీన్ డాక్టర్ అతుల్ ధింగ్రా స్పందించారు. శివాంశీ.. ఇస్రోకు ఎంపిక కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కఠోర శ్రమ వల్లే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలను సాధించి.. తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. 



కాగా.. ఇస్రోకు ఎంపిక కావడంపట్ల శివాంశీ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే తాను అప్లై చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గతానికి భిన్నంగా ఈసారి ఎంపిక ప్రక్రియ జరిగిందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి మొదటగా రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ కూడా జరిపిన తర్వాతే ఇస్రో అభ్యర్థులను ఎంపిక చేసేందని పేర్కొన్నారు. కరోనా కారణాల వల్ల ఈ ఏడాది రాత పరీక్ష నిరహించలేదన్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించారు. రెండేళ్ల కోర్సులో భాగంగా ఏడాదిపాటు డెహ్రాడూన్‌లో విద్యాభ్యాసం చేసి అనంతరం నెథర్లాండ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. సెకండ్ ఇయర్‌లో భాగంగా అక్కడ పలు అంశాలపై పరిశోధనలు చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో సాటిలైట్ సేవలపై తన పరిశోధనలు సాగనున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. శివాంశీ తండ్రి విజయ్ కుమార్.. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ అగ్రికల్చర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తల్లి పుష్పా యాదవ్ గృహిణి. కాగా.. తండ్రినే ఆదర్శంగా తీసుకుని శివాంశీ.. అగ్రికల్చర్ రంగం వైపు అడుగులు వెసినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-09-13T17:06:49+05:30 IST