మమతను రెచ్చగొట్టే నినాదం ‘జై శ్రీరామ్’ : హర్యానా మంత్రి

ABN , First Publish Date - 2021-01-24T01:30:46+05:30 IST

‘జై శ్రీరామ్’ నినాదాన్ని వింటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి

మమతను రెచ్చగొట్టే నినాదం ‘జై శ్రీరామ్’ : హర్యానా మంత్రి

న్యూఢిల్లీ : ‘జై శ్రీరామ్’ నినాదాన్ని వింటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహానికి గురవుతారని హర్యానా మంత్రి అనిల్ విజ్ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలపై ఆమె వ్యవహరించిన తీరుపై అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం మమత బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడేందుకు ఉపక్రమించినపుడు సభలోని కొందరు ‘జై శ్రీరామ్’, ‘మోదీ, మోదీ’ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై హింద్, జై బంగ్లా’ అంటూ నినాదాలు చేశారు. పిలిచి మరీ అవమానించకూడదని మండిపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విక్టోరియా మెమోరియల్‌లో ఏర్పాటు చేసినందుకు మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రసంగించకుండానే వేదిక నుంచి నిష్క్రమించారు. 


మమత తీరుపై హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మమత బెనర్జీ సమక్షంలో ‘జై శ్రీరామ్’ అనడమంటే ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించడమేనని పేర్కొన్నారు. అందుకే ఆమె విక్టోరియా మెమోరియల్‌లో తన ప్రసంగాన్ని ఆపేశారన్నారు. 


Updated Date - 2021-01-24T01:30:46+05:30 IST