MBA గ్రాడ్యుయేట్‌వి.. లక్షల్లో జీతమొచ్చే జాబ్‌ను వదిలేసి ఇదేం పని అన్న వాళ్లే.. ఇప్పుడు లాభం చూసి నోరెళ్లబెడుతున్నారు..!

ABN , First Publish Date - 2021-11-10T18:14:35+05:30 IST

కరోనా కష్టకాలంలో..

MBA గ్రాడ్యుయేట్‌వి.. లక్షల్లో జీతమొచ్చే జాబ్‌ను వదిలేసి ఇదేం పని అన్న వాళ్లే.. ఇప్పుడు లాభం చూసి నోరెళ్లబెడుతున్నారు..!

ఇంటర్‌నెట్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఉద్యోగం ఊడిపోయి చాలామంది తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి చేసిన పనికి ఇంట్లో వాళ్లతోపాటు స్నేహితులు కూడా ‘ఇదేం బుర్ర తక్కువ పని రా..’అని తిట్టిపోశారు. ఉద్యోగాలు పోయి అందరూ బాధపడుతుంటే.. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగాన్ని ఎలా వదులుకున్నావని అతడిమీద కోపడ్డారు. కానీ అలాంటి వ్యక్తులే.. ఇప్పడు అతడిని మెచ్చుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..!


హర్యానా రాష్ట్రం చర్ఖీ దాద్రీ జిల్లాలోని మంధి పిరాను గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేశాడు. వారిది రైతు కుటుంబం. అతడి తండ్రి పొలం పనులు చూసుకుంటూ.. వారి గ్రామంలోని పాఠశాలలో కూడా పనిచేస్తుంటాడు. డిగ్రీ అయిపోగానే ప్రదీప్ సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అందులో విజయం సాధించలేకపోవడంతో.. ఎంబీఏ వైపు వెళ్లాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం చాలానే ప్రయత్నించాడు. చివరికి వీల్స్ ఎలక్ట్రిక్ అనే కంపెనీలో 2018లో ఉద్యోగం వచ్చింది. బాగా కష్టపడి పని చేసే వ్యక్తిత్వం ప్రదీప్‌ది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించేది. ఆయనకు ప్రమోషన్‌లు చాలానే వచ్చాయి. కానీ ప్రదీప్‌కు ఉద్యోగం చేయడంలో కిక్ లభించలేదు. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. 2019 చివర్లో ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాడు. అది కూడా కరోనా సమయంలో.


జాబ్ వదిలేశానని ఇంట్లో చెప్పడంతో.. అతడిని అందరూ తిట్టిపోశారు. జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నావని అన్నారు. ‘కరోనా సమయంలో.. ఉన్న షాపులే మూసేస్తుంటే.. నువ్వేం వ్యాపారం మొదలుపెడతావు?’అని స్నేహితులు ప్రశ్నించారు. ప్రదీప్ వాళ్ల మాటలేం పట్టించుకోలేదు. ఏ బిజినెస్ అయితే బాగుంటుందని తెలుసుకోవడానికి ప్రదీప్ ఏకంగా 24 రాష్ట్రాలు తిరిగాడు. చివరికి ఆయన ఓ విషయాన్ని గ్రహించాడు. రైతులు మూడు రకాల వ్యాపారాలు చేయగలరని గ్రహించాడు. అవి, 1.తృణధాన్యాలు, పప్పులు మొదలైనవి., 2.పాలు, 3.గుడ్లు. ప్రదీప్ పాల వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. అయితే వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి అని ఆలోచిస్తుండగా.. ఆయనకు ఓ విషయాన్ని గమనించాడు.



రోహ్‌తక్‌లో రెండు పెద్ద పార్కులున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. అక్కడైతే తన వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందనుకున్నాడు. ఆ పార్కుల బయట తన ‘బాగ్దీ మిల్క్ పార్లర్’ను ప్రారంభించాడు. ప్రదీప్ అనుకున్నది సాధించాడు. మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌కు వచ్చే వాళ్లు తన పార్లర్‌కు రావడం మొదలైంది. 2019లో ప్రారంభంలో కరోనా కారణంగా వ్యాపారం అంతంతమాత్రమే జరిగేది. కానీ, ఇప్పుడు బాగా జరుగుతోంది. దీంతో ప్రదీప్‌కు భారీగానే లాభాలు వస్తున్నాయి. ఉద్యోగం వదిలేసి వచ్చినప్పుడు ఎవరైతే ఆయనను తిట్టిపోశారో.. వారే ఇప్పుడు ప్రదీప్ లాభం చూసి నోరెళ్లబెడుతున్నారు.



ప్రదీప్ మాట్లాడుతూ, మొదటి ఉద్యోగం సంపాదించడం కోసం తాను చాలా కష్టపడ్డానని, ఇప్పడు తానే నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని అన్నారు. కరోనా సమయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదని, వారికి కావలసిన వసతులు కల్పించి మరీ.. 75శాతంతో జీతమిచ్చానని చెప్పారు. పార్కు ఎదుట పాల వ్యాపారం అయితే బాగా వృద్ధి చెందుతుందని, తన ఐడియా పనిచేసిందని చెప్పాడు. ఇప్పుడు తమ పార్లర్‌లో పాలకు సంబంధించిన 20రకాల పదార్థాలు లభిస్తాయన్నారు. కేవలం హర్యానా వాళ్లే కాదు.. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ నుంచి కూడా తమ పార్లర్‌లోని పదార్థాలు కొనుగోలు చేయడానికొస్తున్నారని చెప్పాడు. తన పనిని తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానన్నాడు. ఎవరైనా పాల వ్యాపారం చేయాలనుకుంటే.. వారికి తన తోడ్పాటు అందిస్తానన్నాడు.  



Updated Date - 2021-11-10T18:14:35+05:30 IST