బెజవాడలో హరియాణ మందు

ABN , First Publish Date - 2021-02-26T08:12:47+05:30 IST

పేద, మధ్య తరగతి, ధనిక.. ఇవి మూడూ జీవనప్రమాణ స్థాయులు. ధనిక వర్గాలను మినహాయిస్తే, మునిసిపల్‌ ఎన్నికల్లో చురుగ్గా పాలుపంచుకొనే పేద, మధ్యతరగతి ఓటర్లలోని మద్యం ప్రియులను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు....

బెజవాడలో హరియాణ మందు

  • ఓటు మద్యంలో ఎన్నెన్నో కోణాలు..  
  • మునిసిపాలిటీల్లో లిక్కర్‌ జోరు
  • తెలంగాణనూ దాటి సాగుతున్న వేట
  • డిమాండ్‌ ఉన్న ఎంసీ, ఓఏబీ బ్రాండ్లను
  • తెప్పించి దాస్తున్న అభ్యర్థులు
  • గన్నవరంలో 500 సీసాలు పట్టివేత

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

పేద, మధ్య తరగతి, ధనిక.. ఇవి మూడూ జీవనప్రమాణ స్థాయులు. ధనిక వర్గాలను మినహాయిస్తే, మునిసిపల్‌ ఎన్నికల్లో చురుగ్గా పాలుపంచుకొనే పేద, మధ్యతరగతి ఓటర్లలోని మద్యం ప్రియులను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ‘బ్రాండ్ల’ను రంగంలోకి దింపుతున్నారు. జీవనరేఖలకు తగ్గట్టు పంపిణీ చేయడానికి ఇప్పటికే మందును సిద్ధం చేశారు. ఇందులో మాన్సన్‌ హౌస్‌(ఎంసీ), ఓఏబీ(ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ) బ్రాండ్లను రహస్య ప్రదేశాల్లో భద్రపరిచారు. ప్రచారంలో అభ్యర్థుల వెనుక తిరిగేవారికీ, తాయిలాలను ఆశించే మందుప్రియులకు వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎంసీని మధ్యతరగతికి, ఓఏబీ బ్రాండ్‌ను పేదలకి అందిస్తున్నారు. 

రాష్ట్రంలో కావాల్సినంత మద్యం దొరుకుతుంది. కానీ, కొత్త కొత్త బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. వాటిని తాగినా కిక్‌ ఉండడం లేదు. పైగా మద్యం మూడు సీసాలకు మించి విక్రయించరు. ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే బాగా ఎక్కువ. దీంతో అభ్యర్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. మద్యంప్రియులు అమితంగా పుచ్చుకొనే ఎంసీ మద్యం 180 ఎంఎల్‌ సీసాను ఇక్కడ రూ.250లకు విక్రయుస్తున్నారు. అదే సీసా తెలంగాణలో రూ.162కు లభిస్తోంది. ఓఏబీ 180 ఎంఎల్‌ సీసా ఇక్కడ రూ. 150కి, తెలంగాణలో రూ.130కి లభిస్తోంది. తెలంగాణ నుంచి ఎంసీ, ఓఏబీ మద్యం బ్రాండ్లను రప్పిస్తున్నారు. ఇక హరియాణ, ఒడిసా, పశ్చిమబెంగాల్‌ నుంచీ సరుకును భారీగా నగరంలోకి తీసుకొచ్చారు. 


అన్ని దారులూ అటే..

విజయవాడ కీలకమైన ట్రాన్స్‌పోర్టు హబ్‌. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్టు లారీలు వెళ్తుంటాయి. అభ్యర్థులు.. లారీల డ్రైవర్లకు ముడుపులు ఇచ్చి బయట రాష్ట్రాల నుంచి మద్యం భారీఎత్తున ఇక్కడికి రప్పిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో కొద్దిరోజుల క్రితం ఎస్‌ఈబీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో హరియాణకు చెందిన 500 మద్యం సీసాలను లారీలో పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్యాన్ని ఎక్కువగా ప్లాస్టిక్‌ సీసా ల్లో విక్రయిస్తారు. వాటిని ఒక బాక్సులో గానీ, డబ్బాలో గానీ కుప్పగా పోసి లారీల్లో పెట్టుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో విజయవాడ చేర్చుతున్నారు. తెలంగాణతోపాటు హరియాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిసా నుంచి మద్యం జోరుగా ప్రవహిస్తోంది. ఎస్‌ఈబీ పోలీసులు ఈ మార్గాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఇబ్రహీంపట్నం వైపున సూరాయపాలెం వద్ద, నున్న వైపు నుంచే మందును అడ్డుకోవడానికి కొత్తూరు తాడేపల్లి, సూరంపల్లి వద్ద చెక్‌పోస్టు, పశ్చిమబెంగాల్‌, ఒడిసా నుంచి వచ్చే సరుకును గుర్తించడానికి పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-02-26T08:12:47+05:30 IST