హర్యానా కేబినెట్‌‌ విస్తరణ..కొత్తగా ఇద్దరికి చోటు

ABN , First Publish Date - 2021-12-28T23:42:34+05:30 IST

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ మంగళవారంనాడు మంత్రివర్గ విస్తరణ..

హర్యానా కేబినెట్‌‌ విస్తరణ..కొత్తగా ఇద్దరికి చోటు

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ మంగళవారంనాడు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ హిసార్ ఎమ్మెల్యే డాక్టర్ కమల్ గుప్తాకు, ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)నుంచి ఆ పార్టీ తోహనా ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ బబ్లికి చోటు కల్పించారు. వీరురువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత రెండేళ్లలో కత్తార్ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి.


కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ముఖ్యమంత్రితో కలిసి మంత్రివర్గ  సభ్యుల సంఖ్య 14కు చేరింది. మంత్రివర్గ సభ్యుల గరిష్ట పరిమితి కూడా 14 కావడం విశేషం. తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో కత్తార్ క్యాబినెట్‌లో బీజేపీకి చెందిన 10 మందికి, జేజేపీకి చెందిన ముగ్గురికి మంత్రిపదవులు దక్కినట్టయింది.


కత్తార్ ముఖ్యమంత్రిగా, దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా 2019 అక్టోబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో కత్తార్ తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిపి 10 మందిని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 40 స్థానాలు గెలుచుకుంది. సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు లేకపోవడంతో 10 మంది ఎమ్మెల్యేలు కలిగిన జేజేపీతో ఎన్నికల అనంతర పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - 2021-12-28T23:42:34+05:30 IST