చండీగఢ్‌పై పంజాబ్ డిమాండ్‌ను తిప్పికొడుతూ హర్యానా శాసన సభ తీర్మానం

ABN , First Publish Date - 2022-04-05T22:22:30+05:30 IST

పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్‌ను తమకు

చండీగఢ్‌పై పంజాబ్ డిమాండ్‌ను తిప్పికొడుతూ హర్యానా శాసన సభ తీర్మానం

చండీగఢ్ : పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్‌ను తమకు అప్పగించాలని పంజాబ్ శాసన సభ తీర్మానం చేయడంతో హర్యానా అప్రమత్తమైంది. పంజాబ్ వాదనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ హర్యానా శాసన సభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే వరకు ప్రస్తుత సంతులనాన్ని చెడగొట్టవద్దని కోరింది. 


పంజాబ్ శాసన సభ గత శుక్రవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తక్షణమే చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి చర్యల ద్వారా చండీగఢ్‌తోపాటు ఇతర ఉమ్మడి ఆస్తుల పరిపాలనలో సమతుల్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. ఈ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించారు. ఇద్దరు బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ తీర్మానాన్ని హర్యానా రాజకీయ నేతలు ఆక్షేపించారు. దీనిని ఏకపక్షంగా ఆమోదించారని, ఇది అర్థరహితమైనదని ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ మంగళవారం శాసన సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చండీగఢ్‌ను అప్పగించాలని కోరుతూ పంజాబ్ శాసన సభ చేసిన తీర్మానంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య సమతుల్యతను దెబ్బతీసే చర్యలు చేపట్టవద్దని కోరారు. 


పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే వరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య సమతుల్యతను దెబ్బతీసే చర్యలు చేపట్టవద్దని, సామరస్యాన్ని కొనసాగించాలని హర్యానా శాసన సభ తీర్మానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. హర్యానా రాష్ట్రం ఏర్పడటానికి దోహదపడిన ఈ చట్టంలోని నిర్దిష్ట నిబంధనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన అంశాలను కూడా గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సట్లెజ్-యమున లింక్ కెనాల్‌ను నిర్మించాలని కోరింది. దీని కోసం గతంలో ఏడు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపింది. రావి, బియాస్ నదుల జలాల్లో వాటా తీసుకునే హక్కు హర్యానాకు ఉందని తెలిపింది. 


చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం. ఇది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. 


Updated Date - 2022-04-05T22:22:30+05:30 IST