ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థాలు

ABN , First Publish Date - 2021-06-22T08:20:04+05:30 IST

ఆనందయ్య కంటి చుక్కల మందుపై దేశవ్యాప్తంగా ఐదు సంస్థల్లో పరీక్షలు నిర్వహించామని, ఆ మందులో హానికరమైన పదార్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) సి.సుమన్‌ హైకోర్టుకు

ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థాలు

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది.. ప్రమాదమేమీ లేదన్న ఆనందయ్య న్యాయవాది

నివేదికలను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశం


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆనందయ్య కంటి చుక్కల మందుపై దేశవ్యాప్తంగా ఐదు సంస్థల్లో  పరీక్షలు నిర్వహించామని, ఆ మందులో హానికరమైన పదార్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) సి.సుమన్‌ హైకోర్టుకు తెలిపారు. ఆ మందు వాడితే భవిష్యత్తులో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు.  నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కరోనా నివారణ నిమిత్తం బి.ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆనందయ్య తయారు చేస్తున్న ఐదు రకాల మందుల్లో పి, ఎఫ్‌, ఎల్‌, కె మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. కంటి చుక్కల మందు విషయంలో స్టెరిలిటీ పరీక్ష నిర్వహించి, సాధ్యమైనంత త్వరగా నివేదిక తెప్పించాలని గత విచారణలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.


సోమవారం ఈ వ్యాజ్యాలపై మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ఎలాంటి ప్రమాదమూ లేదని శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల నివేదిక ఇచ్చిందన్నారు. ఆ మందు కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ స్థాయి పెంచుతుందని తెలిపారు. మందు వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. దీంతో  మందు పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2021-06-22T08:20:04+05:30 IST