మహిళల క్రికెట్‌లో కనీవినీ ఎరగని క్యాచ్‌.. భారత క్రికెటర్ అద్భుతమే చేసింది!

ABN , First Publish Date - 2021-07-10T17:35:44+05:30 IST

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది.

మహిళల క్రికెట్‌లో కనీవినీ ఎరగని క్యాచ్‌.. భారత క్రికెటర్ అద్భుతమే చేసింది!

నార్తాంప్టన్‌: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. శుక్రవారం నార్తాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైనా.. భారత యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఓ అద్భుత క్యాచ్‌ మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది. మహిళల క్రికెట్‌లోనే అది కనీవినీ ఎరగని క్యాచ్‌ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని క్యాచ్‌. కేవలం పురుషుల క్రికెట్‌లోనే ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌లు చూస్తుంటాం. కానీ, డియోల్ అందుకున్న ఈ క్యాచ్ అంతకుమించి అనే చెప్పాలి. మ్యాచ్‌లో శిఖా పాండే వేసిన 18వ ఓవర్‌లోని ఐదో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ జోన్స్‌ భారీ షాట్‌తో బౌండరీ దాటించాలని చూసింది.


అయితే, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డియోల్ ఆ బంతిని అందుకునేందుకు సూపర్ ఉమెన్‌లా మారిపోయింది. అద్భుతమైన డైవ్‌తో వారెవ్వా.. అనిపించే క్యాచ్‌ పట్టింది. తన తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకుంది. క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని గ్రహించిన డియోల్ చాకచక్యంగా వెంటనే బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకునేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. అంతే.. ఒక్క క్షణం మైదానంలోని ప్లేయర్లతో పాటు స్టేడియం గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. డియోల్ క్యాచ్‌తో విస్తుపోయిన అమీ జోన్స్‌ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టింది.


ఈ అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులతో పాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ క్యాచ్‌ అందుకున్న డియోల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు నటాలీ సివర్‌ (55), అమీ జోన్స్‌(43) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 177/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 178 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 8.4 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసిన సమయంలో వర్షం మొదలైంది. ఆ తర్వాత వర్షం ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఇంగ్లాండ్‌ గెలిచింది. 

Updated Date - 2021-07-10T17:35:44+05:30 IST