తాకట్టుకు ‘బెర్మ్‌ పార్క్‌’!

ABN , First Publish Date - 2021-04-11T08:53:47+05:30 IST

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన విజయవాడలోని హరిత బెర్మ్‌ పార్క్‌ను తాకట్టు పెట్టేందుకు పర్యాటక శాఖ రంగం సిద్ధం చేస్తోంది! పర్యాటకాభివృద్ధి సంస ్థ(

తాకట్టుకు ‘బెర్మ్‌ పార్క్‌’!

50 కోట్ల తనఖాకు సంకేతాలు 

అధికారులకు మౌఖిక సమాచారం

బ్యాంకులకా.. ప్రైవేటు సంస్థలకా? 

యూనిట్‌ మేనేజర్ల తర్జనభర్జనలు 

గోప్యత పాటిస్తోన్న ఏపీటీడీసీ


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన విజయవాడలోని హరిత బెర్మ్‌ పార్క్‌ను తాకట్టు పెట్టేందుకు పర్యాటక శాఖ రంగం సిద్ధం చేస్తోంది! పర్యాటకాభివృద్ధి సంస ్థ(ఏపీటీడీసీ) వర్గాలు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి. మేజర్‌ పర్యాటక యూనిట్‌ను రూ.50 కోట్లకు తాకట్టు పెడుతున్నట్టుగా ఆ సంస్థ డీవీఎంలు, యూనిట్‌ మేనేజర్లకు ఇప్పటికే మౌఖిక సమాచారం అందింది. ఆ యూనిట్‌ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన పర్యాటక యూనిట్లు విశాఖలో రెండు ఉన్నాయి. ఒకటి రుషికొండ రిసార్ట్స్‌ కాగా, రెండోది అరకు! రుషికొండ రిసార్ట్స్‌ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అక్కడి రిసార్ట్స్‌లో గదులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిలుపుదల చేశారు.


ఈ రెండింటినీ తాకట్టు పెట్టే అవకాశమే లేదు. వీటి తర్వాత రూ.50 కోట్లకు పైగా రుణం తెచ్చుకోవటానికి వీలైన ప్రాపర్టీ విజయవాడలోనే ఉంది. భవానీపురంలో కృష్ణానది వెంబడి 5.5 ఎకరాల విస్తీర్ణంలో హరిత బెర్మ్‌పార్క్‌ విస్తరించి ఉంది. భవానీ ఐల్యాండ్‌కు చేరుకోవటానికి ఇది గేట్‌వే.  రాష్ట్రంలో ప్రముఖ టూరిజం యూనిట్‌ అంటే హరిత బెర్మ్‌పార్క్‌కు మాత్రమే ఆ స్థాయి ఉందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక్కడి కాటేజీల్లో మొత్తం 30 ఏసీ సూట్‌లతో పాటు ఒక బార్‌ రూం, రెస్టారెంట్‌, ఫంక్షన్‌ హాల్‌ ఉన్నాయి. కృష్ణానది, కాటేజీల మధ్యన ఓపెన్‌ లాన్‌ ఏరియా ఉంది. దీన్ని పార్టీలకు, గ్రాండ్‌ మ్యారేజీలకు అద్దెకు ఇస్తుంటారు. సువిశాలమైన పా ర్కింగ్‌ ఏరియా, ముఖ్యమైన బోటింగ్‌ యూ నిట్‌ ఉన్నాయి. ఇక్కడినుంచే బోట్ల లో పర్యాటకులను కృష్ణానదిలో జలవిహారానికి తీసుకువెళతారు. భవానీ ఐల్యాండ్‌కు పర్యాటకులను చేరవేస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లనే దీని విలువ కూడా ఎక్కువగా ఉంటుంది. భవానీపురంలో గజం రూ.60వేలు పలుకుతోంది. రివర్‌ బెడ్‌ వెంబడి పర్యాటక ప్రదేశం కాబట్టి ఇక్కడ గజం రూ.లక్ష విలువ చేస్తోంది.  


6నెలల కిందటే ప్రతిపాదన 

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండటం, ఆర్థిక ఇబ్బందుల రీత్యా కొంతవరకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచనలో భాగంగా కొవిడ్‌ సమయంలోనే ఆరు నెలల కిందట పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని 8 పర్యాటక యూనిట్లను తనఖా పెట్టేందుకు ప్రతిపాదించారు. దీనిపై ఆయా యూనిట్ల అధికారులు, ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. పర్యాటకశాఖలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఎక్కువగా ఉండటంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. కానీ, తాజాగా రాష్ట్రంలోని ఓ మేజర్‌ యూనిట్‌ను తాకట్టు పెట్టనున్నట్టుగా లీకులు ఇవ్వటంతో.. యూనిట్‌ మేనేజర్లు, డీవీఎంలు తర్జనభర్జన పడుతున్నారు.


ఆ యూనిట్‌ హరిత బెర్మ్‌ పార్క్‌ అని దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే ఈ పార్క్‌ను బ్యాంకులకు తాకట్టు పెడతారా? ప్రైవేటు వ్యక్తులకా అనే అంశం ఏపీటీడీసీలో  చర్చనీయాంశమైంది. రూ.50 కోట్లకే తాకట్టు పెట్టాలనుకుంటున్నట్టు పైకి చెబుతున్నా.. ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రైవేటు సంస్థలకు తాకట్టు పెడితే.. తర్వాత అప్పు తీర్చలేకపోతే హరిత బెర్మ్‌ పార్క్‌ పరాధీనమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-04-11T08:53:47+05:30 IST