టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. బన్నీ హీరోగా వచ్చి తెలుగులో హిట్ సాధించిన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించిన తాజా వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. హరీశ్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' (డీజే) హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారట. ఓ బాలీవుడ్ యంగ్ హీరోతో దిల్ రాజు నిర్మాణంలోనే ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని సమాచారం. హరీశ్ శంకర్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'భవదీయుడు భగత్‌సింగ్' చిత్రాన్ని చేయాల్సి ఉంది. దీని తర్వాత అధికారికంగా 'డీజే' హిందీ రీమేక్‌ను ప్రకటిస్తారని సమాచారం. ఇక ఇటీవలే దిల్ రాజు, హరీశ్ శంకర్ జీ 5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, సంకల్ప్ రెడ్డి లాంటి పలువురు దర్శకులు హిందీలో ఎంట్రీ ఇచ్చారు. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌తో వివి వినాయక్ కూడా బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుండటం ఆసక్తికరం.