శివాజీ స్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ పోరాటం: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-02-20T07:09:42+05:30 IST

ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడు. ఆయన ఒక మరాఠీ వాసులకే కాదు.. దేశ ప్రజలు మెచ్చుకుని నిస్వార్థ పోరాట తత్పరుడు. శివాజీ పోరాట స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌

శివాజీ స్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ పోరాటం: హరీశ్‌రావు

రామాయంపేట ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడు. ఆయన ఒక మరాఠీ వాసులకే కాదు.. దేశ ప్రజలు మెచ్చుకుని నిస్వార్థ పోరాట తత్పరుడు. శివాజీ పోరాట స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ 14 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమం నడిపి నేడు బంగారు రాష్ట్రంగా ఆవిర్భవించేలా చేశాడని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రామాయంపేటలోని పాత హైవే మధ్యన ప్రతిష్టించిన శివాజీ విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నేటి యువతరం శివాజీ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వచ్చినప్పుడు శివాజీ ఎలా పారిపోలేదో.. నేటి యువత కూడా అదే స్ఫూర్తిదాయకంతో ముందుకు నడవాల్సి ఉందన్నారు. జిల్లాకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు రానున్నాయని మంత్రి తెలిపారు. లక్ష ఎకరాల మాగాణికి సాగునీరు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఒక ప్రణాళికాబద్ధంగా పురోభివృద్ధిలో పరుగెడుతుందని చెప్పారు. రామాయంపేటను మోడల్‌ మున్సిపల్‌గా మార్చితీరుతానని హామీనిచ్చారు. ఇక్కడికి పరిశ్రమలు రప్పించేలా తాను పట్టుదలతో కృషిచేస్తానని, అప్పుడే ఈ ప్రాంత నిరుదోగ్య సమస్య తీరి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.


మరో నాలుగు లైన్ల రోడ్డు

 పట్టణం మీదుగా త్వరలోనే మరో నాలుగు లైన్ల రోడ్డు వెళ్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధానికి చేరువులో ఉన్న రామాయంపేట ఖ్యాతిని మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ఇక్కడికి మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెప్పించి నియోజకవర్గం పోయిందన్న బాధను మరిపించేలా చేయడం నా బాధ్యతే అని మాటిచ్చారు. దత్తత చేసుకున్న పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అందరు మెచ్చేలా నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రగతితో అభివృద్ధికి బాటలు వేద్దామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సమస్యలు లేని ప్రాంతంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ సరాఫ్‌ యాదగిరి, సొసైటీ చైర్మన్‌ బాదే చంద్రం, పప్పుల బాపురెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, ఐలయ్య, దేమే యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


మంత్రి హరీశ్‌రావుకు ఘనస్వాగతం 

శివాజీ విగ్రహావిష్కరణకు రామాయంపేటకు వచ్చిన హరీశ్‌రావుకు ఘనస్వాగతం లభించింది. స్థానిక ఛత్రపతి శివాజీ యువసేన భారీ బైక్‌ ర్యాలీగా ఆయన వెంట కదిలి వచ్చింది. మహిళల బతుకమ్మలతో మంత్రికి స్వాగతం పలికారు. స్థానిక దౌల్తాబాద్‌ చౌరస్తాలో.. సిద్దిపేట క్రాస్‌ రోడ్‌ నుంచి మంత్రి వెంట ర్యాలీగా తరలారు. అనంతరం సభావేదిక వద్ద టీఆర్‌ఎస్‌ నేతలు గజమాలతో మంత్రిని సత్కరిస్తూ శివాజీ కాంస్య విగ్రహాలను బహుకరించారు.


గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్‌ జిల్లా నేత అహ్మద్‌

కాంగ్రెస్‌ మెదక్‌ జిల్లా నేత ఎస్‌.కె.అహ్మద్‌ బుధవారం గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్‌ సమక్షంలో 50 మంది సహచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఊహించని విధంగా ఆయన పార్టీ మారడం రామాయంపేటలో చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-02-20T07:09:42+05:30 IST