దోమలు లేకుంట కావాలె!

ABN , First Publish Date - 2020-02-20T07:08:13+05:30 IST

పల్లెప్రగతిపై సీఎంతో పాటు ఐఏఎస్‌ ప్రత్యేక టీమ్‌లు తనిఖీ నిర్వహిస్తాయి. పనుల్లో ఏ మాత్రం వెనుకబడినా ఉద్యోగాలు ఊడుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

దోమలు లేకుంట కావాలె!

మెదక్‌ రూరల్‌, ఫిబ్రవరి 19 : పల్లెప్రగతిపై సీఎంతో పాటు ఐఏఎస్‌ ప్రత్యేక టీమ్‌లు తనిఖీ నిర్వహిస్తాయి. పనుల్లో ఏ మాత్రం వెనుకబడినా ఉద్యోగాలు ఊడుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో పల్లెప్రగతి పంచాయతీ సమ్మేళనం నిర్వహించారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌ పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులతో పల్లెల్లో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం పల్లెప్రగతిని తీసుకొచ్చారన్నారు. 30 రోజుల 10 రోజుల పల్లెప్రగతి పనులు బాగా చేశారని, కేవలం ఐదుశాతం గ్రామపంచాయతీలే వెనుకపడ్డాయన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సమావేశంలో పల్లెప్రగతి పనులపై తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారన్నారు. ప్రధానంగా పెంచిన మొక్కల రక్షణతో పాటు నర్సరీలు పెంచడం, శ్మశాన వాటికల నిర్మాణం, డంపు యార్డులు, తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా ఉంటే పల్లెలు ఆదర్శంగా మారుతాయన్నారు. ?


మెదక్‌ను నంబర్‌ వన్‌గా మార్చాలి

ప్రభుత్వం ప్రతీనెల రూ.339 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకునే విధంగా చట్టం రూపొందించిందని గుర్తుచేశారు. పల్లెప్రగతిలో జిల్లా ప్రస్తుతం 22వ స్థానంలో ఉందని, మెదక్‌ను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా మార్చేందుకు అందరూ కృషిచేయాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సింగూరులో 1.5 టీఎంసీని నిల్వ ఉంచామని, మార్చి 1 నుంచి అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌, డీఆర్డీఏ ఉమాదేవి, పీఆర్‌ఈఈ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనాథ్‌, ఆప్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, ఏఎస్పీ నాగరాజుతో పాటు జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 


విద్యుత్‌ అధికారులపై మంత్రి ఆగ్రహం.

పల్లెప్రగతి పనుల్లో విద్యుత్‌శాఖ పనితీరు అధ్వాన్నంగా ఉందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఏఈలందరిని పిలిచి మరీ వారి పనితీరు ఎలా ఉందని సర్పంచుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇందులో టేక్మాల్‌ ఏఈ ఇంద్రకరణ్‌రెడ్డి నిర్దేశించి పనులన్నీ పూర్తిచేసినందుకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో సన్మానం చేయించారు. రేగోడ్‌ ఇన్‌చార్జి ఏఈ రాంబాబు పనితీరు బాగలేదని వెంటనే సస్పెండ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. మూడో తీగ బిగించలేదని స్కూల్‌తండా, సుల్తాన్‌పూర్‌ సర్పంచులు పేర్కొనడంతో వెంటనే ఏఈ రాజేశ్వర్‌కు మెమో జారీచేయాలని ఆదేశించారు. 


శ్మశాన వాటికల్లో ఏరుకుంటారా..?

శ్మశాన వాటిక  పనుల్లో కమీషన్లు ఏరుకోవడం ఏంటని మంత్రి హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు సర్పంచులు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే మీరు కమీషన్ల పేరిట వారిని ఇబ్బందులు పెట్టొద్దని మందలించారు. శ్మశానవాటిక, డంపు యార్డుల నిర్మాణాలపై ఏఈలు శ్రద్ధ చూపాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు శ్మశాన వాటిక ముగ్గులు పోయడంతో పాటు పనులు వేగంగా జరిపించి బిల్లులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


ప్రారంభం కాని శ్మశానవాటికల నిర్మాణం

డంపుయార్డు నిర్మాణాల్లో జిల్లా వెనుకబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. 469 గ్రామపంచాయతీల్లో 169 గ్రామాల్ల ఇంకా శ్మశాన వాటిక పనులు ప్రారంభించకపోవడం ఏంటని ప్రశ్నించారు. భూ సమస్యలు ఉన్న గ్రామాల్లో ఆయా డివిజన్ల ఆర్డీవోలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాలోల నాటి మొక్కల్లో కనీసం 85 శాతం కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామపంచాయతీలపై ఉందని, లేకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. 


డీపీవోపై హరీశ్‌రావు ఆగ్రహం

జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌పై మంత్రి హరీ్‌షరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి నివేదికతో పాటు మెదక్‌ జిల్లాలో డంప్‌యార్డులు, శ్మశాన వాటికల వివరాలు లేకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో ఎంతమంది పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయన్నారు. 29 ఖాళీగా ఉన్నట్లు చెప్పడంతో ఎందుకు భర్తీచేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్‌తో కలిసి వారంరోజుల్లోగా కొత్త వారిని నియమించాలని ఆదేశించారు. 


సీఎం వ్యవసాయ క్షేత్రంలో దోమల చెట్టు

దోమల రహిత పల్లెగా మార్చేందుకు అన్నిగ్రామాల్లో కృష్ణ తులసీ చెట్లను పెంచాలని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి రిసార్ట్స్‌లో దోమల చెట్లు పెట్టాడన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి రిసార్ట్స్‌లో దోమలు లేని విషయాన్ని గ్రహించి ఓ సర్పంచ్‌లు విత్తనాలు తెచ్చి దోమల చెట్లు పెట్టాడన్నారు. దీంతో ఆ గ్రామంలో దోమలు లేకుండా అయ్యాయన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో కృష్ణతులసీ మొక్కలు నాటి దోమలు లేకుండా చేశారన్నారు. జిల్లాలోని అన్నిగ్రామాల్లో దోమల చెట్టు పెంచేందుకు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. ఇందుకు కలెక్టర్‌ రూ.10 లక్షలు ఇస్తారని, ఎంపీడీవోలు, సర్పంచులు పరిశీలించి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతో  వెళ్లి పరిశీలించాలన్నారు. 


గత ఎమ్మెల్యేలు ఏసీ గదులకే పరిమితం

పల్లెప్రగతిపై గత పాలకులు పట్టించుకోలేదని, అప్పట్లో ఎమ్మెల్యేలు అంటే ఏసీ గదుల్లో కూర్చోవడం, నిజాం క్లబ్‌లో పేకాట ఆడడం మినహా చేసిందేమీ లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో ఏ సీఎం పల్లెప్రగతిపై ఆలోచించలేదని, కానీ కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృషిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ ఇదే విషయాన్ని సూచించారన్నారు.

Updated Date - 2020-02-20T07:08:13+05:30 IST