Abn logo
Sep 2 2021 @ 23:45PM

ఆయన ఓ రబ్బర్‌ స్టాంప్‌.. సొంతగా జీవో కూడా ఇవ్వలేరు

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

కుంకుమ భరిణలు పంచినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. 

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావు ఒక రబ్బరు స్టాంప్‌ అని, ఆయనకు స్వేచ్ఛ లేదని, సొంతంగా ఒక జీవో కూడా ఇవ్వలేని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. గురువారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఓనర్లం మేము అని తాను మాట్లాడిన తర్వాతే హరీష్‌రావుకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్‌లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని, డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్‌ మీడియాలో పెట్టి యాక్షన్‌ చేస్తున్నాడన్నారు. 


‘హరీష్‌రావు.. సవాలు చేస్తున్నా.. అభివృద్ధి జరగలేదు.. డబుల్‌ బెడ్‌రూం కట్టలేదు.. కంకుమ భరిణలు పంచి ఓట్లు అడిగేస్థాయికి దిగజారావు.. అంటున్నారు.. వీటన్నిటి మీద హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో బహిరంగ చర్చకు రా’.. అని అన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉనప్పుడు ఏసీడీపీ నిధులు తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకున్నాం కదా..? మరెందుకు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు. తాను 18 ఏళ్లలో ఎంతో మందిని ఉద్యోగాల్లో పెట్టించానని, ఇప్పుడు వారిని తొలగిస్తున్నారని, కుల సంఘాల వారిని బెదిరిస్తున్నారన్నారు. హరీష్‌, ఆయన మామ ఇద్దరూ కలిసి తలకిందులుగా జపం చేసినా, పబ్బతి పట్టినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలవదన్నారు.


ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే తాను  నియోజకవర్గానికి నిధులు తెచ్చుకున్నానన్నారు. 3,900 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అవసరమని సర్వే చేసి తెచ్చుకున్నానని.. అందులో 2 వేల ఇళ్ల వరకు పూర్తయినా రోడ్లకు, స్తంభాలకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవి ఇంకా ప్రారంభించలేదన్నారు. వారి నియోజకవర్గాలో కాళేశ్వరం కాంట్రాక్టర్‌ ఇళ్లు కట్టారని, తాను కాంట్రాక్టర్లను బతిమిలాడి ఇళ్లు కట్టించానన్నారు. హరీష్‌రావు తిరుగుతున్న ఫోర్‌లైన రోడ్లు తాను వేయించినవే అన్నారు. ఔట్‌సోర్సింగ్‌, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు.. దళితులకు సంవత్సరానికి 10 వేల కోట్లు ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. తాను ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారని, 2004 అఫిడవిట్‌ తీస్తే ఎవరి ఆస్తులు ఎంతో తెలుస్తుందన్నారు. మఫ్టీలో తిరుగుతున్న వందలమంది పోలీసులను తొలగించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.


హుజూరాబాద్‌లో ఇచ్చే పింఛన్లను సిద్దిపేట నుంచి వచ్చి నాయకులు పంచుతున్నారన్నారు. గులాబీ కండువాలు వేసుకొని దళితబంధు సర్వేలో పాల్గొంటున్నారు. ఆ సొమ్ము మీ అయ్య జాగిరా.. అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ పట్టణ శివారులోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్దకు ఈటల రాజేందర్‌ నాయకులను, విలేకరులను తీసుకువెళ్లారు. ఇవన్నీ తన హయాంలో నిర్మించినవి కావా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్‌ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ, ఎం కొంరయ్య, రాముల కుమార్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.