పల్లె ప్రగతి నిధులు పెండింగ్‌ లేవు

ABN , First Publish Date - 2022-06-02T10:18:36+05:30 IST

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 1: పల్లె ప్రగతికి సంబంధించి అన్ని బిల్లులు చెల్లించామని, తమ దృష్టికి వచ్చిన ఏ ఒక్క బిల్లు కూడా పెండిగ్‌లో లేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

పల్లె ప్రగతి నిధులు పెండింగ్‌ లేవు

- 1.30 లక్షలకు పైగా చెక్కులకు నిధులిచ్చాం: ఎర్రబెల్లి

- పల్లె, పట్టణ ప్రగతి కింద ప్రతి పైసా చెల్లించాం

- సంజయ్‌, రేవంత్‌.. గోబెల్స్‌ ప్రచారకులు: హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 1: పల్లె ప్రగతికి సంబంధించి అన్ని బిల్లులు చెల్లించామని, తమ దృష్టికి వచ్చిన ఏ ఒక్క బిల్లు కూడా పెండిగ్‌లో లేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18 వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బుధవారం సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక పోస్టర్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతికి సంబంధించి లక్షా ముప్పై వేలకు పైగా చెక్కులకు సంబంధించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎలాంటి చెక్కులు పెండిగ్‌లో లేవని, కొందరు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హమీ పథకం పనుల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రావల్సిన రూ.1,100 కోట్లను కేంద్రం ఆపిందని మండిపడ్డారు. ఆ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు లేఖలు రాసినా స్పందించడం లేదన్నారు. ఎవరో చెప్పింది మీడియాలో ప్రచురించవద్దని, వివరాలు క్షుణ్నంగా పరిశీలించి ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. సర్పం చులను గౌరవిస్తూ, వేతనాలు కూడా పెంచామని, వారి సమస్యలను కూడా తీర్చామని ఆయన తెలిపారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏప్రిల్‌, మే నెలలతో పాటు ఈరోజు వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి కింద రూ.700 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించిన పనులకు సంబంధించినవే పెండింగ్‌లో ఉన్నా యని, అవి కూడా 2 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. గ్రామాల్లో సర్పంచులు చాలా చక్కగా పనిచేస్తున్నారని, సోషల్‌ మీడియా ద్వారా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి అద్భుతమైన పథకమని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గోబెల్స్‌లా అబద్ధాలు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ.1,100 కోట్లతో పాటు.. ఇంకా రూ.8,995 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉ న్నాయని, ఇందులో ఎక్కువ గ్రామ పంచాయతీలకు, మండలాకు వెళ్లే నిధులే అని చెప్పారు. ఈ నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించి అప్పుడు మాట్లాడాలని బండి సంజయ్‌కు సూచించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా వచ్చి తిట్టుడే తప్ప చేసిందేమీ లేదని ఆయన అన్నారు.

Updated Date - 2022-06-02T10:18:36+05:30 IST