రైతు భరోసాతో అన్నదాతకు మోసం

ABN , First Publish Date - 2020-07-09T12:13:58+05:30 IST

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు ఇంత వరకు డబ్బులు చెల్లించకుండా నిస్సిగ్గుగా అన్నదాతలను దగా చేస్తూ రైతు ..

రైతు భరోసాతో అన్నదాతకు మోసం

హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి


 కడప (నాగరాజుపేట), జూలై 8: రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు ఇంత వరకు డబ్బులు చెల్లించకుండా నిస్సిగ్గుగా అన్నదాతలను దగా చేస్తూ రైతు ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డిలు మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో 24 లక్షల మంది రైతులకు జగన్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. స్థానిక హరిటవర్స్‌లో బుధవారం విలేకర్లతో వారు మాట్లాడుతూ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి కేవలం రూ.7500 ఇచ్చి మొండిచేయి చూపడం దారుణమన్నారు. రైతులు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో టీడీపీ నేత రాంప్రసాద్‌ ఉన్నారు.


రైతుల జీవితాలపై జగన్‌ ఆర్థిక సామ్రాజ్యం : అమీర్‌బాబు 

రైతుల జీవితాలపై సీఎం జగన్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు ఆరోపించారు. మురికొండ, కాకరాపల్లె, సోంపల్లెలో కాల్పులు జరిపి 15 మంది రైతులను పొట్టనబెట్టుకున్నందుకు రైతు భరోసా దినోత్సవం జరుపుకున్నారా అని ప్రశ్నించారు. ఆయన నివాసంలో మీడియాతో బుధవారం మాట్లాడారు. 13 వేల కోట్లు కేటాయించి 5 వేల కోట్లు ఖర్చు చేసి వ్యవసాయరంగాన్ని నీరుగార్చారన్నారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలతో పాటు రాష్ట్రమిస్తున్న రూ.13,500తో కలిపి మొత్తం రూ.19,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు ఆమూరి బాలదాసు, వికా్‌సహరిక్రిష్ణ, మాసాపేటశివ, జయకుమార్‌, నాసర్‌ అలీ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-09T12:13:58+05:30 IST