అదే ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-06-24T05:41:10+05:30 IST

అదే ఉత్కంఠ

అదే ఉత్కంఠ
హరిభూషణ్‌ స్వగ్రామం మడగూడెం గ్రామం, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ (ఫైల్‌)

హరిభూషణ్‌ మృతిపై కొనసాగుతున్న సందిగ్ధత

ధ్రువీకరించిన ఎస్పీ కోటిరెడ్డి

నమ్మమంటున్న కుటుంబసభ్యులు, బంధువులు

మౌనం వీడని మావోయిస్టు ప్రతినిధులు


కొత్తగూడ, జూన్‌ 23 : 28 ఏళ్ల ఉద్యమ శిఖరం కూలిపోయిందన్న విషయం కొత్తగూడ – గంగారం ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు నమ్మలేకపోతున్నారు. చిన్ననాడే ఉద్యమబాట పట్టిన ఆదివాసీ బిడ్డ.. ఏళ్ల తరబడి విప్లవోద్యమంలా పాల్గొని నేలకొరగడం గిరిజనం ఇంకా నమ్మలేకపోతోంది. మావోయిస్టు అగ్రనేత యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతిపై ఇంకా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. హరిభూషణ్‌ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నమ్మమని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు. 


మౌనం వీడని మావోయిస్టులు..

మావోయిస్ట్‌ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు హరిభూషణ్‌ మృతిపై జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. హరిభూషణ్‌ అనారోగ్యంతో సోమవారం మృతి చెందినట్టు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్‌దత్‌, మహబూబాబాద్‌ ఎస్సీ కోటిరెడ్డి వెల్లడించారు. కానీ, మావోయిస్టు వర్గాలు మాత్రం మౌనం వీడటం లేదు. పార్టీలో ఎన్‌కౌంటర్‌లు జరిగినా.. ఎవరైనా అనారోగ్యంతో మృతిచెందినా మావోయిస్టు ప్రతినిధులు ప్రకటనలు విడుదల చేస్తారు. కానీ, మావోయిస్టుపార్టీకి ఆగ్రనేతగా కొనసాగుతున్న హరిభూషణ్‌ మృతిపై జరుగుతున్న ప్రచారంపై మావోయిస్టులు ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. కనీసం ఖం డించడం లేదు. దీంతో ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ మండలాల్లో నలుగురు కలిసిన చోట ఇదే చర్చ కొనసాగుతోంది.


మేము నమ్మం..

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ మృతిపై స్వగ్రామం మడగూడలో ఉత్కంఠ కొనసాగుతోంది. హరిభూషణ్‌ చనిపోయా డని తాము నమ్మం అని కుటుంబసభ్యులు, బంధు వులు, గ్రామస్థులు అంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయ పనుల్లో మునిగిపోతున్నారు. మొత్తానికి మావోయిస్టులు చేసే ప్రకటన వైపే హరిభూషణ్‌ కుటుంబసభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.


ప్లీనరీలోనే వైరస్‌..

గంగారం, జూన్‌ 23 : మావోయిస్టు పార్టీ నిర్వహించిన ఓ ప్లీనరీకి హాజరైన అగ్రనేతలకు కరోనా వైరస్‌ సోకినట్లు సమాచారం. అదే సమయంలో కేంద్రకమిటీ సభ్యుడైన హరిభూషణ్‌ కరోనా బారిన పడినట్లు తెలిసింది. కొవిడ్‌తో పాటు హరిభూషణ్‌కు గుండెనొప్పి రావడంతో మృతి చెందాడని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే హరిభూషణ్‌ మృతిని మావోయిస్టు పార్టీ ప్రకటించే వరకు తాము ఈ వార్తను నమ్మలేని ఆయన సోదరులు రమేష్‌, అశోక్‌ తెలిపారు. గతంలో రాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కంచాల, దారెల్లి, పువర్తి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లలో హరిభూషణ్‌ మృతి చెందినట్లు పోలీసులు పలుమార్లు ప్రకటించారని అన్నారు. మృతదేహాలను గుర్తుపట్టండని, సంబంధంలేని వారిని చూపించి తమను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు కాదు.. మావోయిస్టులు ప్రకటించే వరకు ఈ విషయాన్ని నమ్మలేమన్నారు. అప్పటివరకు హరిభూషణ్‌ బతికి ఉన్నట్లుగానే భావిస్తామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.


లొంగిపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోండి..


నక్సలైట్లకు వైద్యసహాయం అందిస్తాం..

మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి 

హరిభూషణ్‌ మృతి చెందినట్లు ధ్రువీకరణ


మహబూబాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌–19బారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని, వారికి వైద్యసహాయం అందించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ కరోనాతో బాధపడుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల నుంచి కిందిస్థాయి సభ్యులు, మిలిషీయా సభ్యులు కూడా మహమ్మారి వైరస్‌ బారిన పడ్డారని వివరించారు. పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్‌, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్‌రెడ్డి, దామోదర్‌, భద్రు,హరిభూషణ్‌ భార్య శారద కూడా కరోనా సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. 

సరైన వైద్యం అందక మావోయిస్టు నేతలు గడ్డం మధుకర్‌ అలియాస్‌ సోబ్రాయి, నందు, హరిభూషణ్‌, ఇతర నాయకుల మరణాలకు పార్టీ అగ్రనేతలే బాధ్యత వహించాలని అన్నారు. నక్సల్స్‌ బయటకు రావాలని చూస్తున్న నాయకులు, సభ్యులను అగ్రనాయకత్వం బయటకు రానీయకుండా అడ్డుపడుతూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టు పార్టీలో కొవిడ్‌ వైరస్‌ సోకి ఇబ్బందులు పడుతున్న నాయకులు, సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయి మెరుగైన వైద్యం పొందాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుశాఖ వారికి అన్నిరకాలుగా వైద్యసహాయం అందిస్తుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల ప్రతిఫలాలను అందేలా తామే  బాధ్యత తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

Updated Date - 2021-06-24T05:41:10+05:30 IST