Hardik Pandya కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-20T03:09:19+05:30 IST

హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదుకోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో

Hardik Pandya కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ముంబై: హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదుకోవడంతో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఆరంభం కలిసిరాలేదు. ఓపెనర్ శుభమన్ గిల్ (1) 21 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూవేడ్ (16) కూడా రాణించలేకపోయాడు. మరోవైపు, క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు దిశగా పయనిస్తున్నట్టు కనిపించిన వృద్ధిమాన్ సాహా (31) రనౌట్ కావడంతో పరుగులు రావడం కష్టమైంది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా-డేవిడ్ మిల్లర్ జోడి బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ పరుగులు పెంచుకుంటూ పోయారు.  ఈ క్రమంలో పాండ్యా జోరు పెంచాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన మిల్లర్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా (2) కూడా వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరాడు.


అయితే, రషీద్ ఖాన్‌తో కలిసి పాండ్యా చివర్లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హాజిల్‌వుడ్ వేసిన ఆ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 17 పరుగులు పిండుకోవడంతో స్కోరు 168 పరుగులకు చేరుకుంది. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు, రషీద్ ఖాన్ 6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2022-05-20T03:09:19+05:30 IST