పాండ్యా ఫటాఫట్.. మిల్లర్ మెరుపులు.. రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-15T03:02:05+05:30 IST

హార్దిక్ పాండ్యా ఫటాఫట్ ఇన్నింగ్స్‌కు తోడు డేవిడ్ మిల్లర్ మెరుపులు తోడవడంతో రాజస్థాన్‌తో

పాండ్యా ఫటాఫట్.. మిల్లర్ మెరుపులు.. రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యం

ముంబై: హార్దిక్ పాండ్యా ఫటాఫట్ ఇన్నింగ్స్‌కు తోడు డేవిడ్ మిల్లర్ మెరుపులు తోడవడంతో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాలు విసిరింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌కు ఆరంభం అంత కలిసి రాలేదు. 53 పరుగులకే మాథ్యూ వేడ్ (12), విజయ్ శంకర్ (2), శుభమన్ గిల్ (13) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది.


అయితే, క్రీజులో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అభినవ్ మనోహర్ తోడవడంతో వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడింది. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పారు. ఫోర్లు, సిక్సర్లతో జోరు పెంచారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన మనోహర్ అవుటైన తర్వాత డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. అతడొచ్చాక ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది.


బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతడి దెబ్బకు కుల్దీప్ సేన్ నాలుగు ఓవర్లలో ఏకంగా 51 పరుగులు  సమర్పించుకున్నాడు. మరోవైపు, పాండ్యా కూడా చెలరగేడంతో రాజస్థాన్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2022-04-15T03:02:05+05:30 IST