నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-07-31T06:43:07+05:30 IST

నాటు సారా తయారీ, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, కౌన్సెలింగ్‌ చేసినా తీరుమారకపోతే పీడీ యాక్ట్‌తోపాటు జిల్లా బహిష్కరణ విధిస్తామని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు హెచ్చరించారు.

నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు
జిల్లా వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న నాటుసారాను ప్రత్యేకంగా తవ్విన గోతుల్లోకి పారబోస్తున్నఎస్పీ రవీంద్రనాథ్‌

  • పీడీ యాక్ట్‌, జిల్లా బహిష్కరణ తప్పదు: జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
  • రూ.50 లక్షల విలువైన 20,479 లీటర్ల నాటు సారా ధ్వంసం

సర్పవరం జంక్షన్‌, జూలై 30: నాటు సారా తయారీ, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, కౌన్సెలింగ్‌ చేసినా తీరుమారకపోతే పీడీ యాక్ట్‌తోపాటు జిల్లా బహిష్కరణ విధిస్తామని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం కాకినాడ రూరల్‌ మండలం నేమాం సముద్రతీరంలో జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), పోలీసు శాఖల ఆధ్వర్యంలో 1605 కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.50 లక్షల విలువచేసే కాపు, నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా, అక్రమరవాణా, మాదకద్రవ్యాలు, గంజాయి, గుట్కా నిరోధానికి వీలుగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఎస్‌ఈబీని కమిషనర్‌, జేడీ, ఏఎస్పీలతో ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 16 ఎస్‌ఈబీ స్టేషన్లు, 71 పోలీస్‌స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో సమష్టిగా కృషి చేయడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. నాటు, కాపుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న వారు తక్షణమే ఈ వృత్తి నుంచి వైదొలగాలని కోరారు. లేని పక్షంలో వీరిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పరివర్తన కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని, చదువుకున్న యువతీ,యువతకు ఉద్యోగం లేదా జీవనోపాధి లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సారా, మాదకద్రవ్యాల సరఫరా, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎస్‌ఈబీకి 9490618510కు సమాచారం అందివ్వాలన్నా రు. తర్వాత గోతుల్లో నాటు, కాపుసారాను పారబోశారు. ఏఎస్పీ కె.కుమార్‌, ఎస్‌ఈబీ జేడీ రమాదేవి, ఏసీ ఎం జయరాజు, డీఎస్పీ వీ భీమారావు, సీఐలు మురళీకృష్ణ, బి.రాజశేఖరరావు, తహశీల్దార్‌ మురళీకృష్ణ, సర్పంచ్‌ రాందేవు చిన్న, ఎస్‌ఐ ఎన్‌. రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:43:07+05:30 IST