రాజ్యసభ సభ్యుడిగా హర్భజన్ సింగ్.. ప్రకటించిన ‘ఆప్’

ABN , First Publish Date - 2022-03-17T21:53:22+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం

రాజ్యసభ సభ్యుడిగా హర్భజన్ సింగ్.. ప్రకటించిన ‘ఆప్’

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఈ నెలాఖరున జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో అందులో ఓ స్థానాన్ని హర్భజన్‌కు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించాలని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ యోచిస్తున్నట్టు సమాచారం. 


పంజాబ్‌ శాసనసభ ఎన్నికలకు ముందు హర్భజన్ సింగ్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు బీజేపీలో చేరబోతున్నట్టు అప్పట్లో బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే, ఈ వార్తలను హర్భజన్ కొట్టిపడేశాడు. ఆ తర్వాత నవజోత్ సింగ్ సిద్ధూతో కలిసి భజ్జీ ఫొటో దిగడంతో కాంగ్రెస్‌లో చేరబోతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, కాంగ్రెస్‌కు కూడా ‘టర్బొనేటర్’ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతడిని రాజ్యసభకు పంపుతున్నట్టు ‘ఆప్’ ప్రకటించింది.


Updated Date - 2022-03-17T21:53:22+05:30 IST