వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-24T07:00:08+05:30 IST

మగపిల్లలు లేరని భార్యకు వేధింపులు.. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య ఆత్మహత్యా యత్నం చేసి 17 రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందింది.

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
శ్రుతి (ఫైల్‌ ఫొటో)

17రోజులు మృత్యువుతో పోరాడి ఓటమి

ఏపీలోని యానాంలో ఈనెల 3న ఘటన  

కోదాడ, టౌన్‌, జూన్‌ 23: మగపిల్లలు లేరని భార్యకు వేధింపులు.. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య ఆత్మహత్యా యత్నం చేసి 17 రోజుల పాటు  చికిత్స పొందుతూ మృతి చెందింది. కేతేపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన వీరభద్రయ్య–విజయ దంప తులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కుమార్తె  చిత్తం శ్రుతి(28)ని  కోదాడ పట్టణానికి చెందిన చిత్తలూరి వెంకన్న–లక్ష్మమ్మ దంపతుల కుమారుడు నరేష్‌కు ఇచ్చి  ఆరేళ్ల క్రితం వివాహం చేశారు.  వివాహ సమయంలో నిజమాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరేష్‌ ఆ తదుపరి ఏపీ రాష్ట్రానికి సమీపంలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు బదిలీ అవడంతో అక్కడే నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఐదు, మూడేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు హన్వీ, సాయి ఉన్నారు. దీంతో మగ పిల్లలు లేరని  భర్త వేధించేవాడు. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి.  ఈ నేపథ్యంలో యానాంలోని అద్దె ఇంట్లో ఈ నెల మూడవ తేదీన శ్రుతి వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన భర్త మంటలను ఆర్పి,  భార్యను చిక్సిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించి అత్తామామలకు సమాచారం అందించాడు. కాకినాడకు వెళ్లిన శ్రుతి తల్లిదండ్రులు కుమార్తెను మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రుతి ఈనెల 20న మృతి చెందింది. శ్రుతి ఆత్మహత్యాయత్నంపై యానాంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవటంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రప ర్చారు.  శ్రుతి మృతి చెందిందని సమాచారం అందుకున్న యానాం పోలీసులు హైదరాబాద్‌కు మంగళవారం చేరుకుని పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని బుధవారం ఉదయం కోదాడకు తరలించారు. 

 భర్త ఇంటి ఎదుట మృతదేహంతో దర్నా

కట్నకానుకలు ఘనంగా ఇచ్చి వైభవంగా వివాహం చేశామని, కుమార్తె చనిపోవడంతో ఇద్దరు చిన్నారుల పరిస్థితి తల్లిదండ్రులు విల పించారు.  మనవరాళ్లకు న్యాయం చేయాలని   బంధువులతో   భర్త ఇంటి ఎదుట ధర్నా చేశారు. దీంతో ఇరువైపులా పెద్దమనుషులు.  చిన్నారుల పేరిట ఏడు ఎకరాల భూమిని  తాతయ్య, నాయనమ్మ, తండ్రి రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు, పిల్లల సంరక్షణ బాధ్యతను తాతయ్య, నాయనమ్మ స్వీకరించేలా రాజీ చేశారు. ఒప్పందం ప్రకారం మూడున్నర ఎకరాలను మనవరాళ్ల పేరిట నరేష్‌ తల్లిదండ్రులు తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. కేసులు ముగిసిన పిదప మనవరాళ్లకు మరో మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసే విధంగా ఒప్పం దం చేసుకున్నారు. దీంతో శ్రుతి అంత్యక్రియలను మామ నిర్వహించారు. 






Updated Date - 2021-06-24T07:00:08+05:30 IST