పైశాచిక పంజా

ABN , First Publish Date - 2022-08-12T05:52:50+05:30 IST

. ఇటీవల ముక్కు పచ్చలారని బాలి కలపై అత్యాచార ఘటనలు పెరు గుతున్నాయి.

పైశాచిక పంజా

మైనర్లపై ఆగని అకృత్యాలు.. నేరస్తులంతా తెలిసిన వారే

ఏడు నెలల్లో 18 కేసులు.. వెలుగులోకి రానివెన్నో

పలు కేసుల్లో పోలీసులు, నాయకుల పంచాయితీలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 

‘నా 13 ఏళ్ల కూతురిని మా పక్కింటి కుర్రాడు లైంగికంగా వేధిస్తున్నాడు. పోలీసులను ఆశ్రయిస్తే మమ్మల్నే ఇళ్లు ఖాళీ చేసి పొమ్మంటున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏం చేయాలి ? ’ ఓ బాలిక తండ్రి ఆవేదన.

‘జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు కన్నేశాడు. ప్రేమించమని వేధిస్తూ.. ఆమె పట్టించుకోలేదని చావ కొట్టాడు’ ఇది మరో బాధితురాలి ఆక్రందన. 

ఆరేళ్ల బాలికపై బంధువు అత్యాచారం.. 

ఒంటరి బాలికపై వలంటరీ అఘాయిత్యం..

13 ఏళ్ల బాలికకు పక్కింటి కుర్రాడి వేధింపులు.. 

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం.. 

ఇవి నిత్యం పత్రికల్లో కనిపించే అత్యాచార వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తరచూ ఏదొకమూల ఇలాంటి అకృ త్యాలు జరుగుతున్నాయి. ఇటీవల ముక్కు పచ్చలారని బాలి కలపై అత్యాచార ఘటనలు పెరు గుతున్నాయి. ఇది ఎవరో తెలియని వారు చేసింది కాదు.. చుట్టుపక్కల వారు, బంధువులే నిందితులుగా తేలు తున్నారు. ఏలూరు దిశ పోలీసు స్టేషన్‌లో గడచిన ఏడు నెలల్లో మైనర్‌ బాలికలపై వేధింపుల కేసులు అధికంగా నమో దవుతున్నాయి. అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనల్లో రక్త సంబంధీకులు లేదా పక్కింటి వాళ్లనే దోషులుగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ ఏడాది మొ దటి నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో 18 కేసులు నమో దయ్యాయి. ప్రస్తుతం ఆ కేసులన్నీ కోర్టు విచారణలో ఉన్నా యి. చాలా కేసుల్లో బాధిత బాలికలకు ప్రాథమిక పరీక్ష, చికి త్సలు జరిపించడం లేదు. దీనివల్ల ఈ కేసుల్లో ఆధారాలు గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ తెలిసినా కొందరు అధికారులు పలు కేసుల్లో నిబంధనలను పాటించడం లేదు. ఫలితంగా సకాలంలో న్యాయం జరిగే అవకాశాలుండవు.

వెలుగు చూసేవి కొన్నే..

కొత్తపేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ స్పందనలో కలెక్టర్‌కు తన ఫిర్యాదు అందించాడు. 13 ఏళ్ల తన కూతురిని ఆకతాయిగా తిరుగుతున్న తమ పక్కింటి యువకుడు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు అతని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్నానాలు చేస్తున్నప్పుడు ఫొటోలు తీయడం, అడిగితే తమపైనే దాడి చేయడం అతనికి పరిపాటి అయ్యిందని బాధితుడు అంటున్నాడు. అయితే స్పందించిన కలెక్టర్‌ వెంటనే డీఎస్పీ స్థాయి అధికారికి సమస్యను బదిలీ చేశారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు రావాలని ఆ తండ్రికి అధికారులు చెప్పారు. ఆ సమయానికి వెళ్లినా అధికారులు స్పందించలేదు. పైగా కానిస్టేబుళ్లను నిందితుడి ఇంటికి పంపామని అతడు ఇంట్లో లేరని చెబుతూ ఫిర్యాదుదారుడిని మరుసటి రోజు రావాలని అధికారులు చెప్పి పంపారు. మరుసటి రోజు, ఆ ముందు రోజు తరహాలోనే అధికారులు సమాధానం ఇచ్చినట్టు బాధితుడు వివరిస్తున్నాడు. నిందితుడు ఇంట్లో లేకపోతే కనీసం ఫోన్‌ నెంబర్‌ అయినా తీసుకుని కబురు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయడం లేదు. ఏదైనా ఘోరం జరిగితేనే పట్టించుకుంటారా ? అని ఆ బాలిక తండ్రి ఆవేదన వెల్లగక్కు తున్నాడు. గతంలోనూ ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఇదే తరహాలో ప్రవర్తించారని అతను చెబుతున్నాడు. పైగా కొందరు పోలీసులు తననే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుగా అని ఉచిత సలహాలు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నాడు. ఓ అధికార పార్టీ కార్పొరేటర్‌ ఆ యువకుడికి మద్దతు ఇస్తున్నట్టు తమకు తెలిసిందని అతడు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు పట్టించుకోవడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని, అందుకే తాను కలెక్టర్‌ను కలిశానని వివరిస్తున్నాడు. అయినా తనకు న్యాయం జరుగుతుందో లేదో అనే భయంతోనే బతుకుతున్నామని ఆ తండ్రి విలపిస్తున్నాడు. ఇలాంటి అధికారులు, నాయకుల వల్ల చాలా కేసులు వెలుగులోకి రాకుండానే సద్దుమనుగుతున్నాయి అనడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.


ప్రైవేట్‌ పంచాయితీలు  

బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఇలాంటి కేసుల్లో ప్రైవేట్‌ పంచా యితీలు నడపడమే కారణం. నిందితుల తరపున వత్తాసు పలుకుతూ పలువురు చేస్తున్న అధికార దుర్వినియోగం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తొంది. ఏలూరు, ఏలూరు రూరల్‌ ప్రాంతం ఇందుకు మినహాయింపేమీ కాదు. సమస్య పోలీసు స్టేషన్‌కు వెళుతుందని తెలియగానే కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు. తమ వల్ల కాదని తెలిసిన మరు క్షణమే నాయకులతో అధికారు లకు ఫోన్‌ల ద్వారా సిఫా ర్సులు చేయిస్తున్నారు. బాధితు లను బెదిరిస్తూ కేసును ఫిర్యాదు దశలోనే తొక్కేస్తున్నారు. ఓ వైపు జిల్లా, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు దిశ యాప్‌ ను వేలాది, లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని చెబుతుండగా మరో వైపు ప్రత్యేక అవగాహన కార్యక్రమా లను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యకు ప్రధాన ఆటంకాలను అధిగమించ కుండా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసుకుంటూ పోవడం వల్ల ఏం ప్రయోజనమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2022-08-12T05:52:50+05:30 IST