పౌరసరఫరాలశాఖలో..ఆ సార్‌దే హవా

ABN , First Publish Date - 2020-08-03T10:59:37+05:30 IST

పౌరసరఫరాల శాఖలో ఓ అధికారి దీర్ఘకాలికంగా తిష్ఠ వేసి చక్రం తిప్పుతున్నాడు. డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు అధికారి కింది స్థాయి

పౌరసరఫరాలశాఖలో..ఆ సార్‌దే హవా

దీర్ఘకాలికంగా ఇక్కడే తిష్ఠ

కమీషన్‌ ఇవ్వని ఫైలు అటకపైకే

కిందిస్థాయి ఉద్యోగులకూ తప్పని వేధింపులు


నల్లగొండ/నల్లగొండ టౌన్‌, ఆగస్టు 2: పౌరసరఫరాల శాఖలో ఓ అధికారి దీర్ఘకాలికంగా తిష్ఠ వేసి చక్రం తిప్పుతున్నాడు. డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు అధికారి కింది స్థాయి ఉద్యోగులనూ విడిచిపెట్టడం లేదు. శాఖ ఉన్నతాధికారిని మచ్చిక చేసుకొని అక్రమాల తతంగానికి తెరలేపాడు. కొందరు డీలర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేయగా, వారు ససేమిరా అనడంతో వారికి రావాల్సి కమీషన్లను నిలిపివేయడం ఇటీవల చర్చనీయాంశమైంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేసిన డీలర్లకు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కమీషన్ల రూపంలో సుమారు రూ.2కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. దీనికి 2శాతం కమీషన్‌ ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్‌ చేయడం, డీలర్లు తిరస్కరించడంతో ఏకంగా ఫైల్‌నే తొక్కిపెట్టాడు. దీంతో డీలర్లకు రావాల్సిన కమీషన్‌ నిలిచిపోయింది.


ఓకే ప్రాంతంలో ఏళ్లుగా తిష్ఠ

రెవెన్యూ శాఖ నుంచి ఏరికోరి డిప్యుటేషన్‌పై పౌరసరఫరాల శాఖకు వచ్చిన అ అధికారి ఎనిమిదేళ్లుగా ఒకేచోట తిష్ఠ వేశాడు. ఆయనంటే శాఖలో అందరికీ హడలే. పైస్థాయి అధికారి ఎవరు వచ్చినా మచ్చిక చేసుకోని వసూలు చేసిన ముడుపులు ముట్టజెబుతున్నట్టు శాఖలో వినికిడి. కాంట్రాక్టర్లు పెట్టి ప్రతి ఫైల్‌ తన వద్దకు రావాలని, పైఅధికారి అండను సాకుగా చూపి అధిక మొత్తంలో పర్సంటేజీలు అడుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. లేదంటే సదరు ఫైల్‌ను అటకెక్కిస్తున్నట్టు తెలిసింది.


వేధింపులతో సెలవుల్లోకి వేళ్లే ఆలోచన

సదరు అధికారి వేధింపులతో కొంత మంది ఉద్యోగులు సెలవుల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అతడి కారణంగా సెక్షన్లలో పనులు చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు. అతడి ముడుపుల కోసం తమపై ఒత్తిడి తెస్తున్నాడని, దీంతో చిక్కుల్లో పడేకంటే సెలవుల్లోకి వెళ్లడమే మేలని మిగతా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత గందరగోళానికి దారితీసేలా ఉంది. 


దృష్టికి రాలేదు..రుక్మిణిదేవి, పౌరసరఫరాలశాఖ అధికారి

ఈ విషయం ఇప్పటి వరకు దృష్టికి రాలేదు. నేను ఇక్కడికి బదిలీపై వచ్చి ఏడాది అవుతోంది. కార్యాలయంలో ఉద్యోగులకు ఇతరుల నుంచి వేధింపుల మాట లేదు. అలాంటిది ఏమైనా ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటా.

Updated Date - 2020-08-03T10:59:37+05:30 IST