రెండేళ్ల క్రితం కరోనాతో భర్త, కొడుకు మృతి

ABN , First Publish Date - 2022-06-26T06:37:49+05:30 IST

కరోనా కారణంగా 2020లో భర్త, మామ మృతి చెందడానికి కోడలే కారణమని నిందించారు.

రెండేళ్ల క్రితం కరోనాతో భర్త, కొడుకు మృతి
బాధితురాలు అఖిల

కోడలే కారణమంటూ అప్పటి నుంచి అత్త వేధింపులు...జత కలిసిన మరిది

నష్ట జాతకురాలంటూ చిత్రహింసలు

రెండు రోజుల క్రితం ఇంటి నుంచి గెంటివేత

దిశ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు


పెందుర్తి, జూన్‌ 25: కరోనా కారణంగా 2020లో భర్త, మామ మృతి చెందడానికి కోడలే కారణమని నిందించారు. నష్ట జాతకురాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో బాధితురాలు శనివారం దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దిశ పోలీసుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండెపాలేనికి చెందిన అఖిలకు గోపాలపట్నంలో ఉంటున్న బద్ది చరణ్‌తేజ్‌తో 2014లో వివాహమైంది. పెళ్లయ్యాక పెందుర్తిలో తన తండ్రి నిర్మించిన సొంతింట్లో భార్యతో కలిసి ఉండేవారు. 2016లో వీరికొక బాబు పుట్టాడు.  2020లో చరణ్‌తేజ్‌ తమ్ముడు భవానీకుమార్‌ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో చరణ్‌తేజ్‌, విద్యుత్‌ శాఖలో పనిచేసే ఆయన తండ్రి బాబూరావు కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకు మృతిచెందారు. అప్పటినుంచి అఖిలకు కష్టాలు మొదలయ్యాయి. ఇద్దరి మృతికి కారకురాలివని, నష్ట జాతకరాలివని అఖిలను అత్త సత్యవతి, మరిది భవానీకుమార్‌ శారీరకంగా, మానసికంగా వేధించసాగారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమెకు అన్నపానీయాలు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారు. వాటిని సెల్‌ఫోన్‌లో అఖిల చిత్రీకరించడంతో బలవంతంగా ఫోన్‌ లాక్కొని వాటిని డిలీట్‌ చేసి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె 100కు డయల్‌ చేయడంతో పెందుర్తి పోలీసులు వచ్చి అత్త, మరిదిని మందలించి ఇంట్లో వుంచేలా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని అఖిల తమ బంధువులకు తెలియజేసింది. వారి సహాయంతో శనివారం దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తోందన్న కారణంతో తనను ఇంటి నుంచి గెంటివేశారని, తనకు, తన కుమారుడికి అత్త, మరిది వల్ల ప్రాణ హాని వుందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-26T06:37:49+05:30 IST