Abn logo
Sep 23 2021 @ 03:19AM

సర్కారు అన్‌ ‘హ్యాపీ’

  • హ్యాపీనెస్ట్‌ రివర్స్‌ టెండర్లకు పడని బిడ్‌! 
  • కాంట్రాక్టర్ల అనాసక్తి...ముగిసిన గడువు
  • ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరం?
  • లబ్ధిదారులకు మళ్లీ ఎదురుచూపులే
  • డిసెంబరు తర్వాత న్యాయపోరాటం
  • ఆలోచనలో హ్యాపీనెస్ట్‌ బాధితులు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి) 

హ్యాపీనెస్ట్‌ రివర్స్‌ టెండర్లకు స్పందన కరువైంది. బుధవారం గడువు ముగిసేనాటికి సింగిల్‌ టెండర్‌ కూడా పడలేదు. అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏఎంఆర్‌డీఏ) టెండర్లను ఓపెన్‌ చేయగా ఏ ఒక్క సంస్థ కూడా బిడ్‌ను దాఖలు చేయలేదు. దీంతో హ్యాపీనెస్ట్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే విషయంలో మొదటి నుంచీ పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. ఈ ఏడాది డిసెంబరు నాటికి లబ్ధిదారులకు ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది. అయితే, పుణ్యకాలమంతా గడిపేసి.. చివరికొచ్చేసరికి హడావుడి మొదలుపెట్టింది. బాధితులెవరూ కోర్టును ఆశ్రయించకుండా ఉండటం కోసమే రివర్స్‌ టెండర్‌ ఎత్తు వేసిందనే విమర్శలు ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏఎంఆర్‌డీఏ పిలుస్తున్న చిన్న పనులకు కూడా టెండర్లు పడటం లేదు. అమరావతి రాజధాని భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన నేపథ్యంలో, కాంట్రాక్టర్లకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది.


ఈ సందర్భంలో రూ.640 కోట్ల విలువైన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు ఏఎంఆర్‌డీఏ రివర్స్‌ టెండర్లకు స్పందన లేకుండా పోయింది. కేవలం కోర్టుకు, లబ్ధిదారులకు సమాధానం చెప్పుకోవటానికి తప్పితే ప్రభుత్వానికి ప్రాజెక్టుపై ఆసక్తిలేదనేది కాంట్రాక్టర్లు పసిగట్టారు. ఇప్పటికే రాజధానిలో తలపెట్టిన ఐఏఎస్‌ అధికారుల భవనాలు, ఎంఎల్‌ఏ , ఎంఎల్‌సీ, మంత్రుల గృహాలు, ఎన్‌జీవో భవనాలు, టైప్‌ 1, టైప్‌ 2 గృహాలు వంటివి పురోగతిలో ఉండి కూడా అర్ధంతరంగా ఆగిపోయాయి. సర్కారు మూడు రాజధానుల వైఖరి కారణంగా ఈ పనులను ముందుకు తీసుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న కాంట్రాక్టర్లు.. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు టెండర్లు వేయటానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తి చేయటానికి రెండున్నరేళ్లకు పైగా సమయం దాటి పోయింది. రివర్స్‌ టెండర్లు పిలిచిన నేపథ్యంలో తమకు ఎలాంటి వయబిలిటీ కూడా ఉండదని కాంట్రాక్టు సంస్థలు భావించాయని తెలుస్తోంది. 


డీఫాల్డర్‌గా ప్రకటించండి! 

ప్రాజెక్టు గడువు పూర్తయ్యే వరకు ఓపిక పట్టాలని, అప్పటి వరకు కోర్టుకు వెళ్లకూడదని హ్యాపీనెస్ట్‌ లబ్ధిదారులు నిర్ణయించినట్టు సమాచారం. అయితే, పలువురు లబ్ధిదారులు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది...తమను ఏఎంఆర్‌డీఏ మోసం చేసిందని, రెకా జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. మరికొందరు లబ్ధిదారులు ఏకంగా  ఏఎంఆర్‌డీఏను డీఫాల్టర్‌గా ప్రకటించాలని కోరినట్టు తెలుస్తోంది. సింహభాగం లబ్ధిదారులు మాత్రం గడువు తేదీ వరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాతే ఏఎంఆర్‌డీఏను డీఫాల్డర్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌తో కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.


డీఫాల్డర్‌ గా ప్రకటిస్తే .. 

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు విషయంలో ఏఎంఆర్‌డీఏను భవిష్యత్తులో కోర్టులు, రెరా కానీ డీఫాల్టర్‌గా ప్రకటించాల్సి వస్తే ఏమవుతుంది? ఆ సంస్థ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. డీఫాల్టర్‌గా ప్రకటిస్తే.. ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులను వేటినీ అది చేపట్టే అవకాశం ఉండదు. ఆ అర్హతను కూడా సంస్థ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏఎంఆర్‌డీఏ చేపడుతున్న ఐఏఎస్‌, సెక్రటరీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, నాన్‌ గెజిటెడ్‌ తదితర గృహాల సముదాయాలను నిర్మించే విషయంలో కూడా ప్రతిబంధకాలు ఎదుర య్యే అవకాశం ఉంటుంది. గతంలో సీఆర్‌డీఏగా ఉన్న దానిని ఏఎంఆర్‌డీఏగా ప్రకటించిన నేపధ ్యంలో.. ఒక పట్టణాభివృద్ధి సంస్థగా కూడా ఇలాంటి ప్రాజెక్టులను నిర్మించే హక్కును సంస్థ కోల్పోవాల్సి వస్తుంది.