May 1 2021 @ 17:14PM

మోటార్‌ ఫీల్డ్‌ నుంచి తలా వరకూ!

సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌,
మంచికి మారుపేరు,
ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం,
స్టార్‌ హోదా అనుభవిస్తూ, భారీ వసూళ్లు సాధిస్తూ కూడా సాధారణ జీవితం..
ఇవి తమిళ హీరో తలా అజిత్‌లో ఉన్న విశేష గుణాలు.
శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌ మీద ఓ లుక్కేద్దాం.

పక్కా హైదరాబాదీ...
అజిత్‌ హైదరాబాద్‌లో సుబ్రహ్మమణియన్‌ - మోహిని దంపతులకు 1-5-1971న జన్మించారు. సికింద్రాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించడాని కన్నా ముందు స్నేహితుడి ద్వారా ఓ పెద్ద కంపెనీలో అప్రెంటీస్‌ మెకానిక్‌గా చేరారు అజిత్‌. అది తండ్రికి నచ్చకపోవడంతో వస్త్ర ఎగుమతి సంస్థలో చేరారు. అలా వ్యాపార వెళకువలు తెలుసుకుని స్వతహాగా వ్యాపారం ప్రారంభించాలని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభించారు. అదే సమయంలో మోడలింగ్‌ చేయాలనే ఆశ కలిగింది. ప్రముఖ మోటారు కంపెనీకి వెళ్లినప్పుడు సీనియర్‌ డిఓపీ పీసీ శ్రీరామ్‌ అజిత్‌లోని నటుణ్ణి గుర్తించారు. ఆ మెకానిక్కే తమిళనాట స్టార్‌ హీరో తలా అజిత్‌గా మారి నటుడిగా రికార్డులు సృష్టిస్తున్నారు.


తెరంగేట్రం ఇలా...

1990లో ‘ఎన్‌ వీడు ఎన్‌ కనవర్‌’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు అజిత్‌. అందులో చిన్న పాత్రే అయినా  1993లో ‘అమరావతి’ సినిమాతో కథానాయకుడిగా మారారు. అదే సంవత్సరంలో ‘ప్రేమ పుస్తకం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. ‘ప్రేమలేఖ’ ‘ప్రియురాలు పిలిచింది’, ‘వాలి’  చిత్రాలతో 1990ల్లోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి వరకూ లవర్‌బాయ్‌, క్లాస్‌ పాత్రలతో మెప్పించిన ఆయన మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘ధీన’ చిత్రంతో మాస్‌ హీరోగా గుర్తింపు పొంది ఈ చిత్రంతో బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్‌ పేరు ‘తలా’. ఆ పేరే అజిత్‌కు ముద్దు పేరుగా మారింది. హిందీలో షారుక్‌ఖాన్‌తో ‘అశోక్‌’ అనే చిత్రంలో నటించారు. ‘జి’, ‘విలన్‌’, ‘ఆల్వార్‌’, ‘కిరిదం’, ‘బిల్లా’, ‘బిల్లా 2’, ‘ఆరంభం’, ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ తదితర చిత్రాల్లో అజిత్‌ నటనా విశ్వరూపాన్ని చూపించారు. ప్రస్తుతం ఆయన ‘వలిమై’ సినిమాలో నటిస్తున్నారు. దక్షిణాదిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ప్రేమను సొంతం చేసుకుని పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు అజిత్‌.

రేసింగ్‌ అంటే ఇష్టం..
నటుడు, రేసర్‌, మంచి మనిషి అన్న విషయాలు పక్కనపెడితే అజిత్‌ మొదటి సినిమా విడుదల తర్వాత రేసింగ్‌ వైపు మనసు మళ్లింది. ఆ శిక్షణా సమయంలోనే ఆయన వెన్నెముకకి తీవ్ర గాయమైంది. మూడు శస్త్ర చికిత్సలు జరిగాయి. దాంతో రెండేళ్లకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. ‘ఆశై’ అనే సినిమాతో మళ్లీ హీరోగా ఫామ్‌లోకి వచ్చారు అజిత్‌. సినీ కెరీర్‌ పరంగా అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. ఓసారి రేసింగ్‌లో దెబ్బ తిన్నానని ఆ ఇష్టాన్ని వదిలేయలేదు. దానినీ ఓ కెరీర్‌గా ఎంచుకున్నారు. చాలా విదేశీ పోటీల్లో పార్టిసిపేట్‌ చేసి సత్తా చాటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అజిత్‌లో మంచి ఫొటోగ్రాఫర్‌, చెఫ్‌ కూడా ఉన్నారు. అజిత్‌కి కార్లు అంటే మహా పిచ్చి. రైడింగ్‌ అంటే ఇష్టమైనా ముందు వెనుకా చూడాకుండా డ్రైవ్‌ చేయకూడదంటారాయన.

బిర్యానీ స్పెషలిస్ట్‌
అజిత్‌లో మంచి చెఫ్‌ కూడా ఉన్నారు. సెట్‌లో బిర్యానీని ఘుమఘుమలాడేలా తయారు చేయడంలో ఆయన స్పెషలిస్ట్‌. దానికి కావాల్సిన రెసిపీ మొత్తం ఆయనే తీసుకెళ్లారట. అజిత్‌ గ్యారేజీలో బైకులు, కార్లు ఉన్నట్లే.. కెమెరాలు, వాటికి సంబంధించిన అప్‌డేటెడ్‌ లెన్స్‌లు ఇంట్లో ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో ఆయనే ఫొటోగ్రాఫర్‌ అవతారమెత్తుతారు. సెట్‌లో లైట్‌మెన్‌ నుంచి అగ్ర తారల వరకు అందరినీ తన కెమెరాతో అందంగా ఫొటోలు తీస్తారు అజిత్‌. విహంగ వీక్షణం చేయడం అజిత్‌కి మహా సరదా. విద్యార్థి దశ నుంచే గగనతలంలో ప్రయాణించే వాటిపై మక్కువ చూపేవారాయన. సినిమాలతో బిజీగా ఉన్నా ఎయిర్‌క్రాఫ్టుని నడపడం నేర్చుకున్నారు. అజిత్‌కు షూటింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తమిళనాడు ేస్టట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చెన్నై రైఫిల్‌ క్లబ్‌ టీమ్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇటీవల జరిగిన పోటీల్లో ఆయన ఆరు పతకాలను గెలుచుకోగా అందులో నాలుగు స్వర్ణ పతకాలే!

శాలినితో ప్రేమ పెళ్లి...
1999లో వచ్చిన ‘అమర్కలం’ చిత్రం షూటింగ్‌ సమయంలో కథానాయిక శాలినీతో ప్రేమలో పడ్డారు అజిత్‌. 2000లో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆయనకు భార్య, పిల్లలంటే ప్రాణం. శాలినీని ఓ భార్యగానే కాక మంచి స్నేహితురాలిగా చూస్తారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించమని శాలినీకి స్వేచ్ఛ ఇచ్చిన ఆమె ఇంటికే పరిమితమై భర్త, పిల్లలను బాధ్యతగా చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో అజిత్‌ చెప్పారు. ప్రతిఏటా ఫోర్బ్స్‌ ప్రకటించే అత్యంత సంపాదన కలిగిన ప్రముఖుల జాబితాలో అజిత్‌ పేరు మూడుసార్లు నిలిచింది.

కాలి నడకన తిరుపతికి...
అజిత్‌ బయట చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు వేంకటేశ్వరస్వామి అంటే మహా ఇష్టం. అందుకే ప్రతి ఏటా చెన్నై నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లారు. ఆయన సిబ్బంది కార్లో వెనక ప్రయాణిస్తారు. నడక మధ్యలో రెస్ట్‌ కావాలంటే కార్లో కాసేపు సేద తీరుతారు. గతేడాది ‘వలిమై’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఆ షెడ్యూల్‌ పూర్తికాగానే బైక్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద కటౌట్లు, పాలాభిషేకాలు చేయొద్దని అభిమానులకు తరచూ అజిత్‌ చెబుతుంటారు.