సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-07-08T02:06:37+05:30 IST

హైదరాబాద్: ఆనందానికి షార్ట్ కట్ లు లేవని, ప్రశాంతమైన జీవితానికి పునాది వేసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కోవచ్చని నిపుణులు అంటున్నారు.

సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

హైదరాబాద్: ఆనందానికి షార్ట్ కట్ లు లేవని, ప్రశాంతమైన జీవితానికి పునాది వేసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కోవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ విషయంలోనూ తృప్తి లేకపోవడం, అతిగా తినడం, అవసరం లేకపోయినా వస్తువులు పోగుచేసుకోవడం ఇవన్నీ మనిషిని అసంతృప్తి వైపు నెట్టేస్తాయి. ఇంకా ఏదో కావాలనే మనస్తత్వాన్ని వదులుకోకపోతే ఆనందాన్ని అందుకోలేమనేది వారిమాట. 


జీవితంలో ముందుకు కొనసాగడానికి చేసే చాలా పనుల్లో కొన్ని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే ఆనందానికి సత్వర మార్గం అంటూ లేదు. కొన్నిసార్లు మన వ్యాపకాలే నిజానికి మనల్ని సంతోషంగా ఉంచేది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా చేసేది. వీటితో పాటు మన ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తాయి. 


దీనికి మన రోజువారి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మన చుట్టూ ఉన్నవారితో స్నేహభావంతో ఉండటం, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి నిజంగా మనిషిని సంతోషంగా ఉంచేలా చేస్తాయి. మరోవైపు జీవితంలోని సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించడం వైపు దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. 


మనిషిని నిజంగా సంతోషపెట్టే అంశాలు ఏమిటి?


మనం అందరం ఏదో విధంగా ఆనందానికి కీ కోసం వెతుకుతూనే ఉన్నాం. తరచుగా మన జీవితమంతా ఆనందాన్ని కలిగించే వస్తువుల కోసం చూస్తున్నాము. ఒకరికి ఆనందాన్ని కలిగించేది మరొకరికి సంతోషాన్నిచ్చే విషయం కాకపోవచ్చు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే.. 


1. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి :

చుట్టూ ఉన్న క్షణాలు, సందర్భాలను ఆస్వాదించాలంటే ఒక వ్యక్తి లోపలి నుంచి సంతోషంగా ఉండాలి. అంటే మిమ్మల్ని మీరు అంగీకరించడం, మిమ్మల్ని మీరు స్వీకరించడం ఈ రెండు విషయాలూ తెలిసి ఉండాలి. 


2. ప్రియమైన వారి సమక్షంలో ఉండటం :

మనసుకు నచ్చిన వ్యక్తితో జీవించడం, వారితో అన్ని విషయాలు పంచుకోవడం ఒక అందమైన అనుభూతి. 


3. రోజులో కొంత సమయాన్ని కుటుంబం, స్నేహితులతో గడపడం వారి కంపెనీని ఆస్వాదించడం కూడా ఖచ్చితంగా సంతోషాన్నిస్తుంది.

 

4. ఓపికతో ఎదురుచూడటం కావాలి:

జీవితం మీద అవగాహనను కలిగి ఉండటం ముఖ్యం. లక్ష్యాలను ఏర్పరుచుకోవడం, వాటి కోసం పని చేయడం, వాటిని సాధించడం అనేవి ఏదో సాధించగలమనే మనోధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. 


5. ఫిట్‌గా ఉండడం:

మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. శారీరక శ్రమ చేయడం వల్ల సెరోటోనిన్ - సంతోషకరమైన హార్మోన్ విడుదలవుతుంది. ఇది రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అదే విధంగా యోగా, ధ్యానం సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చు. 


6. ఎటువంటి సమస్యలు ఎదురైనా దిగులుగా కూర్చోవడం, అదేపనిగా వాటి గురించే ఆలోచించి మధన పడటం కంటే వాటిని అధిగమించే పద్దతులను వెతుక్కోవాలి. 


ఇవన్నీ మనల్ని సంతోషంగా రిఫ్రెష్‌గా ఉండేందుకు సహాయపడతాయి. ఇవి కాకుండా, ఒక వ్యక్తి నిజంగా ఏం కోరుకుంటున్నాడో ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా అవసరం. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం వల్ల మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. 

Updated Date - 2022-07-08T02:06:37+05:30 IST