సంతోషానికి మూడు సాధనాలు

ABN , First Publish Date - 2022-04-29T05:30:00+05:30 IST

మనం అందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఆనందం మనకు అన్ని చోట్లా ఆనందాన్నే కలిగిస్తుంది. ఆఫీసులో... సంతోషంగా ...

సంతోషానికి మూడు సాధనాలు

మనం అందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఆనందం మనకు అన్ని చోట్లా ఆనందాన్నే కలిగిస్తుంది. ఆఫీసులో... సంతోషంగా పని చేసేవారు ఎక్కువ సంపాదిస్తారు. ఇంట్లో... సంతోషంగా ఉండే తల్లితండ్రుల పిల్లలు ఉల్లాసంగా ఉంటారు... సంఘంలో... సంతోషంగా ఉన్న వ్యక్తులు మరింత స్వచ్ఛదంగా సహాయపడతారు. క్రీడలలో... సంతోషంగా ఉండే క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన ఇస్తారు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు తన పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆశిస్తాడు తప్ప... దీనస్థితిలో ఉండాలని కోరుకోడు. మనకు నిజంగా ఏం కావాలనేది మనకే తెలియకపోవడం వల్ల... సంతోషాన్ని పొందడం కష్టమవుతోంది. దీన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం. 


సంతోషం లభిస్తుందనే ఆశతో... మనం అన్నిటి వెనుకా పరిగెడుతూ ఉండడం వల్ల అసలైన సంతోషాన్ని కనుక్కోలేకపోతున్నాం. ఒక పిల్లవాడు బొమ్మలలో ఆనందాన్ని కోరుకుంటాడు. యువకుడు స్నేహంలో, వ్యాపారవేత్త డబ్బులో, యోగి చైతన్యంలో ఆనందాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిలో ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆనందం అనేది మన అస్తిత్వపు కేంద్రం నుంచి ఉద్భవించి... బయటకు ప్రసరించే స్వచ్ఛమైన ప్రకంపనం. అది ఆత్మ తాలూకు లక్షణం. మన అస్తిత్వపు మూలాన్ని కనుక్కున్నప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుతాం. ఆందోళన చెందే మనసును శాంతింపజేయడంలోనే సంతోషాన్ని పొందే రహస్యం దాగి ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న, అంతులేని కోరికలే మానసిక ఆందోళనకు కారణం. నెరవేరని కోరిక మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. సంతృప్తితో కోరికలకు కళ్ళెం వేసి, అంతరంగ శాంతిని నెలకొల్పాలి. సంతృప్తిని పెంపొందించే మూడు సాధనాలను మీతో పంచుకుంటాను. అవి మీ సంతోషాన్ని పెంచే అలవాట్లుగా భావించవచ్చు. 

మొదటి సాధనం: ఇవ్వడంలోనే సంతోషం దాగి ఉంది. నేనొక పల్లెటూర్లో పెరిగాను. 


ఒకసారి మా ఇంటికి మా మామయ్య వచ్చారు. కొన్ని రోజులు మాతో ఉన్నారు. వెళ్ళే ముందు... నా చొక్కా జేబులో వంద రూపాయల నోటు పెట్టారు. దాని గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తరువాత ఆ డబ్బుని చూశాను. ఆ రోజుల్లో వంద రూపాయలంటే ఇప్పుడు అయిదు వేలు ఇచ్చినట్టే. ఒక్క రాత్రిలో కోటీశ్వరుణ్ణి అయినంత సంతోషం కలిగింది. ఆ తరువాత చాలా మంది బంధువులు నాకు డబ్బు ఇచ్చారు. కానీ యాభయ్యేళ్ళ తర్వాత కూడా మామయ్య ఇచ్చిన ఆ డబ్బు నాకు గుర్తుంది. ఇవ్వడం మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. గుప్తంగా ఇవ్వడంలో దానిదైన గొప్పతనం ఉంది. మీరు మీ డబ్బును,  సమయాన్నీ, ముఖ్యంగా మీ ప్రేమను ఇవ్వండి. 


రెండో సాధనం: కృతజ్ఞతను పెంపొందించుకోండి. ‘‘కృతజ్ఞత అనేది మానవజాతి తాలూకు నైతిక జ్ఞాపకం’’ అని సామాజిక శాస్త్రవేత్త జార్జి మెల్ర్వా రాశారు. కృతజ్ఞతాభావంలోని అనుభూతి మెరుగైన బంధాలు ఏర్పాటు చేసుకోడానికి సాయపడుతుంది. మనల్ని ఉదారులుగా చేస్తుంది. జీవితంలో సంపూర్ణ సంతృప్తిని పెంచుతుంది. వారానికి ఒకటి రెండు సార్లు... మీరు దేనికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారో డైరీలో రాసుకోండి. మీ సహోద్యోగి సాయం చేస్తే అందులో రాయండి. మీరు లోపలికి రావడం చూడగానే కాఫీ సిద్ధం చేసిన వ్యక్తి గురించి రాసుకోండి. ఉదయం నిద్రలేచి, రెండు నిముషాలు కూర్చొని... భగవంతుడికీ, మీ చుట్టూ ఉన్నవారికీ కృతజ్ఞతా పూర్వకమైన ఆలోచనలను ప్రసరింపజేయండి. కృతజ్ఞతతో నిండిన హృదయం సంతోషకరమైన హృదయం అవుతుంది. 


మూడో సాధనం: వర్తమానంలో జీవించండి. నేనొకసారి పిల్లల ప్రదర్శన చూశాను. ఆ ప్రదర్శన శీర్షిక: ‘ప్రస్తుత క్షణాన్ని వదులుకోవద్దు.’ కానీ ఆ పిల్లల తల్లితండ్రులందరూ ఆ ప్రదర్శనను చూసి ఆనందించడానికి బదులు దాన్ని ఫోన్లలో రికార్డ్‌ చేస్తున్నారు. వర్తమానంలో జీవించడానికి మనం కష్టపడుతూ ఉంటాం. నేను వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్షణం ఇప్పటికే వెళ్ళిపోయింది. అది గతంగా మారిపోయింది. నేను ఆ పదం చెప్పడం పూర్తి కావడానికి ముందే వర్తమానం... గతం అయిపోయింది. మరి ప్రస్తుతంలో జీవించడం అంటే ఏమిటి? నదీతీరంలో ఉన్న చెట్టు వర్తమాన క్షణంలో శాశ్వతంగా ఉంటూ... తన ముందు ఎల్లప్పుడూ ప్రవహించే నీటికి సాక్షిగా ఎలా ఉంటుందో, ఆ విధంగా ఉండాలని భగవద్గీత మనకు చెబుతుంది. స్థితప్రజ్ఞులైనవారు ఈ స్థితిలోనే ఉంటారని అర్జునుడికి శ్రీకృష్ణుడు గుర్తు చేస్తాడు.


చివరిగా ఒక్క మాట. అమెరికన్‌ నవలా రచయిత నథానియల్‌ హౌథ్రోన్‌ ‘‘ఆనందం అనేది సీతాకోకచిలుక లాంటిది. దాన్ని వెంబడిస్తే, అది మీకు ఎప్పటికీ చిక్కదు. కానీ నిశ్శబ్దంగా కూర్చుంటే, అదే మీమీద వాలవచ్చు’’ అన్నాడు. వినమ్రమైన హృదయంతో... నిశ్శబ్దంగా కూర్చొని, ప్రేమలో మునిగిపోవడం అనే చర్య మన లోపల ఒక శూన్యతను సృష్టిస్తుంది. ఆ శూన్యతను మనలోకి ప్రవహించే ప్రకృతి భర్తీ చేస్తుంది. ప్రాణాహుతి ప్రసారంతో కూడిన మీ ధ్యానం ఇలాంటి అనుగ్రహ క్షణాలను మీ అనుభవంలోకి తీసుకురావాలనీ, ఆ శాంతి, ఆనందాలే మీ అత్యుత్తమ అంతిమ లక్ష్యానికి చిహ్నాలు కావాలనీ ప్రార్థిస్తున్నాను.






- శ్రీ కమలేష్‌ పటేల్‌ (దాజీ)

Updated Date - 2022-04-29T05:30:00+05:30 IST