ఊహించిందే జరుగుతోంది..

ABN , First Publish Date - 2022-01-22T05:34:02+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న క్రమంలో భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలను పూర్తిగా అంతరంగికంగా నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశించారు. కానీ కీలక సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఊహించిందే జరుగుతోందన్న వ్యాఖ్యలు రామభక్తుల నుంచి వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి

ఊహించిందే జరుగుతోంది..

ముక్కోటి సమయాన ఆంక్షలను అతిక్రమించిన ఫలితం

నిన్న మొన్నటి వరకు పోలీసు, రెవెన్యూ శాఖల్లో కరోనా వ్యాప్తి

నేడు దేవస్థానంలో ఇద్దరు అధికారులకు పాజిటివ్‌

భద్రాచలం, జనవరి 21 : కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న క్రమంలో భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలను పూర్తిగా అంతరంగికంగా నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశించారు. కానీ కీలక సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఊహించిందే జరుగుతోందన్న వ్యాఖ్యలు రామభక్తుల నుంచి వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ముక్కోటి బందోబస్తు, విధుల్లో పాల్గొన్న జిల్లాలోని పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడ్డారు. ఇదే క్రమంలో తాజాగా శుక్రవారం భద్రాచలం దేవస్థానానికి చెందిన ఇద్దరు కీలక అధికారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైందని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఉత్సవాలను పూర్తిగా అంతరంగింగా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నా అధికార యంత్రాంగం వాటిని బేఖాతరు చేయడమేనని తెలుస్తోంది. 12వతేదీన స్వామి వారికి నిత్యకల్యాణ మండపం వద్ద తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది. ఈ క్రమంలో భక్తులను అనుమతించడంలేదని ప్రకటించింది. కానీ తెప్పోత్సవ వేళ వందలాది మంది పోలీసు శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు చేరడం, భౌతికదూరం విస్మరించడం, ఉత్సవం జరుగుతున్న వేళ గుంపులు గుంపులుగా వేదికను చుట్టుముట్టడం లాంటివి జరగ్గా.. ఈ విషయంపై భక్తుల నుంచి ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. అలాగే ఉత్తరద్వార దర్శన సమయంలో అంతరంగికంగా ఉత్సవ కార్యక్రమాలన్ని జరగాల్సి ఉండగా ఒక కీలక అధికారి   ఆదేశాల మేరకే ఫ్లవర్‌ బ్యాడ్జీలు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలు లోపించి వైరస్‌ వ్యాప్తి చెందిందని, పోలీసు, రెవెన్యూ, దేవస్థానానికి చెందిన అధికారులు, సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దేవస్థానంలో నలుగురు సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో శుక్రవారం భద్రాద్రి దేవస్థానంలో కీలకంగా వ్యవహరించే ఇద్దరు అధికారులకు కూడా పాజిటివ్‌ నిర్ధారణైందని సమాచారం. ఈ క్రమంలో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిపాలన విభాగంలో రోజు విడిచి రోజు సిబ్బంది వచ్చేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికారులు, సిబ్బంది భౌతికదూరానికి ప్రాధాన్యమిస్తూ స్వీయ నియంత్రణలో విధులను నిర్వహించి ఎలాంటి అనారోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యఆరోగ్యశాఖ ఇంటింటా ఫీవర్‌ సర్వేను వేగవంతం చేసింది. ఈ క్రమంలో 12 బృందాలు  1,020 ఇళ్లల్లో శుక్రవారం సర్వే చేసి జ్వర పీడితులను గుర్తిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వీరబాబు తెలిపారు. ఈ క్రమంలో ఆయన పట్టణంలోని వివిధ కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన ప్రక్రియను పరిశీలించడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షల తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చినా భౌతిక దూరం పాటిస్తూ తమ పనులను వెంటనే పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లాలని సూచించారు. అలాగే వ్యాక్సిన్‌ను ప్రతీఒక్కరూ తీసుకోవాలని చెబుతున్నారు. 

Updated Date - 2022-01-22T05:34:02+05:30 IST