వైభవంగా హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2022-05-26T08:00:02+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.ప్రత్యేక పూజలు,అభిషేకాలతో ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి

వైభవంగా హనుమజ్జయంతి
తిరుమల జపాలి ఆలయంలో పూజలు

తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా బుధవారం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.ప్రత్యేక పూజలు,అభిషేకాలతో ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.తిరుమలలోని ఆకాశగంగలో అంజనాదేవికి, బాలాంజనేయస్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జపాలిలోని ఆంజనేయస్వామికి టీటీడీ తరపున ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమజ్జయంతి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఆకాశగంగ, జపాలి ప్రాంతాలతో పాటు తిరుమలలోని నాదనీరాజనంపై ధార్మికోపన్యాసాలు,భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద వున్న ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హథీరాంజీ మఠం అర్జున్‌దా్‌స మహంతు,వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగా చార్యులు, డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్‌, సెల్వం, హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం మండలం బలిజపల్లెకు చెందిన జనసేన కార్యకర్త ఈశ్వర్‌ రాయల్‌ పొర్లుదండాలతో జపాలి క్షేత్రానికి చేరుకుని పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని ఆంజనేయస్వామికి పూజలు చేశారు. తాను 20 ఏళ్లుగా పొర్లుదండాలతో మెట్లమార్గం ద్వారా తిరుమలకు వస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపాడు.  





Updated Date - 2022-05-26T08:00:02+05:30 IST