హనుమాన్ చాలీసా వివాదం : నవనీత్ రాణా దంపతులకు దక్కని ఊరట

ABN , First Publish Date - 2022-04-29T17:43:50+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వద్ద

హనుమాన్ చాలీసా వివాదం : నవనీత్ రాణా దంపతులకు దక్కని ఊరట

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం వద్ద హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించి, అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలకు శుక్రవారం కోర్టులో ఊరట లభించలేదు. వీరిద్దరూ దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులపై శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. 


ఉద్ధవ్ థాకరేలో హిందుత్వాన్ని మేలుకొలిపేందుకు తాము ఆయన నివాసం వద్ద హనుమాన్ చాలీసాను పఠిస్తామని రాణా దంపతులు ప్రకటించారు. ఆ విధంగా చేయవద్దని పోలీసులు ఆదేశించారు. శనివారం (ఏప్రిల్ 23) ఉదయం శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాణా నివాసానికి చేరుకుని, ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ దంపతులు చేసిన ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు వస్తున్నందువల్ల తాము ఉద్ధవ్ నివాసం వద్ద హనుమాన్ చాలీసాను పఠించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఖార్ పోలీసులు రాణా దంపతులను అరెస్టు చేశారు. 


అమరావతి ఎంపీ నవనీత్ రాణా, బడ్నేరా ఎమ్మెల్యే రవి రాణాలపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), బోంబే పోలీస్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నవనీత్ బైకులా జైలులోనూ, రవి తలోజా జైలులోనూ ఉన్నారు. 


Updated Date - 2022-04-29T17:43:50+05:30 IST