హనుమాన్ చాలీసా వివాదం.. రాణా దంపతుల అరెస్టు

ABN , First Publish Date - 2022-04-24T02:08:58+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ' ముందు తలపెట్టిన..

హనుమాన్ చాలీసా వివాదం.. రాణా దంపతుల అరెస్టు

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ' ముందు తలపెట్టిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న కొద్ది గంటలకే బీజేపీఎమ్మెల్యే రవి రాణా, ఆయన భార్య, పార్లమెంటు సభ్యురాలు నవనీత్ రాణాలను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టిచేందుకు ప్రయత్నించారనే కారణంగా ఈ అరెస్టులు జరిగాయి. ఐపీసీ, ముంబై పోలీస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఖర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాంద్రా కోర్టు హాలిడే బెంచ్ ముందు ఆదివారంనాడు వీరిని హాజరుపరచనున్నారు.


తొలుత ఖర్‌లోని రాణా దంపతుల నివాసానికి వెళ్లిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాణా దంపతులు సైతం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ముందు ఆందోళనకు దిగినందున ఉద్ధవ్ థాకరే, శివసేన నేతలు అనిల్ పరబ్, సంజయ్ రౌత్ సహా 700 మందిపై సెక్షన్ 120బి, 143, 147, 148, 149, 452, 307, 153ఎ, 294, 504, 506 కింద కేసులు నమోదు చేయాలని ముంబై పోలీసులకు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.


శివసేన కార్యకర్తల నిరసన...

దీనికి ముందు, శనివారం ఉదయం ముంబైలోని రాణా దంపతుల ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు తాము హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ దంపతులు హెచ్చరించిన నేపథ్యంలో శివసేన కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. రాణా దంపతులు శుక్రవారం ఉదయం ముంబై చేరుకున్నప్పటి నుంచి శివసేన కార్యకర్తలు మాతోశ్రీతో సహా ముంబైలోని వివిధ ప్రదేశాల్లో గుమిగూడారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు జోన్ 9 డీసీపీ మంజునాథ్ షెంగే సైతం రాణా  దంపతులకు నోటీసులు అందించారు. కాగా, చివరి నిమిషంలో రాణా దంపతులు మాతోశ్రీ ముందు తమ హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. ముంబైలో మోదీ పర్యటించనున్నందున అసలే విధులతో సతమతమవుతున్న పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశంతో తమ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2022-04-24T02:08:58+05:30 IST