విహారి వేచి చూడాల్సిందే

ABN , First Publish Date - 2022-01-08T09:04:37+05:30 IST

భారత టెస్టు జట్టులో హనుమ విహారి స్థానం ఎప్పుడూ సందేహాస్పదంగానే ఉంటుంది. సిడ్నీ టెస్టులో అతడి వీరోచిత ఆటతీరుతో సుస్థిర స్థానం ఖాయమనుకున్నా అలా జరగలేదు.

విహారి వేచి చూడాల్సిందే

మూడో టెస్టుకు కోహ్లీ సిద్ధం!

సిరాజ్‌ సందేహమే

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

’జొహాన్నె్‌సబర్గ్‌: భారత టెస్టు జట్టులో హనుమ విహారి స్థానం ఎప్పుడూ సందేహాస్పదంగానే ఉంటుంది. సిడ్నీ టెస్టులో అతడి వీరోచిత ఆటతీరుతో సుస్థిర స్థానం ఖాయమనుకున్నా అలా జరగలేదు. దీనికి తోడు గాయాల బెడదతో జట్టుకు దూరమయ్యాడు. కివీ్‌సతో సిరీ్‌సకు సైతం పక్కనబెట్టి.. భారత్‌ ‘ఎ’ తరఫున సఫారీ టూర్‌కు పంపారు. ఈ జట్టులో అద్భుతంగా రాణించడంతో టీమిండియాకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో స్థానం దక్కకపోగా.. కోహ్లీ గాయం.. శ్రేయాస్‌ కడుపునొప్పి కారణంగా రెండో మ్యాచ్‌ ఆడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో 40 (నాటౌట్‌) పరుగులు చేశాడు. కానీ చివరి టెస్టులో ఉంటాడా? అంటే మళ్లీ సందేహమే.. ఎందుకంటే టెస్టు జట్టులో రెగ్యులర్‌ బ్యాటర్‌గా ఉండాలంటే విహారితో పాటు శ్రేయాస్‌ అయ్యర్‌ మరికొంత కాలం వేచిచూడాల్సి ఉంటుందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. కోహ్లీ, పుజార, రహానెలతో మిడిలార్డర్‌ నిండిపోవడమే అతని వాఖ్యలకు కారణం. ‘ఏదేమైౖనా విహారి రెండో టెస్టులో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తు అవుటయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అతడి ఆట మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అలాగే శ్రేయాస్‌ కూడా దక్కిన చాన్స్‌ను చక్కగా వినియోగించుకున్నాడు. కచ్చితంగా వారికంటూ ఓ సమయం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో సీనియర్‌ ఆటగాళ్లున్నారు. వారు కూడా తమ కెరీర్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించినా జట్టులో స్థానం కోసం వేచిచూసిన వారే. కాబట్టి ఎవరికైనా ఎదురుచూపులు తప్పవు’ అని ద్రవిడ్‌ తేల్చాడు.


కోహ్లీ వస్తాడు..!

దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని కోచ్‌ తెలిపాడు. వెన్నునొప్పితో విరాట్‌ రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రాహుల్‌ కెప్టెన్సీలో జరిగిన ఆ టెస్టును భారత్‌ నాలుగు రోజుల్లోనే ఓటమితో ముగించింది. ‘ప్రస్తుతానికి కోహ్లీకి ఎలాంటి ఇబ్బందీ లేదు. మూడో టెస్టుకు ఇంకా తగిన సమయం ఉంది. కేప్‌టౌన్‌లో జరిగే నెట్‌ సెషన్లలో అతను పాల్గొంటే అంతా సర్దుకుంటుందని ఆశిస్తున్నా. నాకు తెలిసినంత వరకైతే అతడు వేగంగా కోలుకుంటున్నాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కూడా సాధిస్తాడని భావిస్తున్నా’ అని తెలిపాడు.


 సిరాజ్‌ కోలుకునేనా?

చరిత్రాత్మక సిరీస్‌ విజయం కోసం ఆశపడుతున్న భారత జట్టుకు మూడో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలేలావుంది. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తొడకండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. ఈ కారణంగానే అటు రెండో టెస్టులోనూ పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ‘సిరాజ్‌ ఫిట్‌గా లేడు. అతడి ప్రస్తుత స్థితిని అంచనా వేయాల్సి ఉంది. మరో నాలుగు రోజుల్లో అతడు కోలుకోగలడా లేదా అనేది స్కానింగ్‌లో తేలనుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఇది మా వ్యూహంపై ప్రభావం చూపింది’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 


 ఆ విషయమై పంత్‌తో చర్చిస్తాం

రెండో టెస్టులో రిషభ్‌ పంత్‌ బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు, కీలక సమయాల్లో షాట్ల ఎంపికపై అతడు విమర్శలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో పంత్‌ బ్యాటింగ్‌ తీరుపై చర్చిస్తామని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. ‘పంత్‌ ఆటతీరు విభిన్నంగా ఉంటుంది. అతడి వైవిధ్యమైన తీరుతోనే విజయవంతమయ్యాడు. కానీ కొన్నిసార్లు షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడుతున్నాడు. రెండో టెస్టులో షాట్ల ఎంపిక సరిగా లేకనే విఫలమయ్యాడు. సందర్భానికి తగ్గట్టుగా ఎలా ఆడాలో అతడితో చర్చి స్తాం. అతనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు’ అని  అన్నాడు. 

Updated Date - 2022-01-08T09:04:37+05:30 IST