నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి!

ABN , First Publish Date - 2020-02-18T08:11:44+05:30 IST

నిర్భయ దోషులను ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు కొత్త తేదీని ఖరారు చేసింది. మార్చి 3న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని తిహార్‌ జైలు అధికారులను ఆదేశించింది

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి!

  • కొత్త తేదీని ప్రకటించిన పటియాలా కోర్టు
  • జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న వినయ్‌ శర్మ
  • ఈ సారైనా ఉరి తీస్తారని ఆశ: నిర్భయ తల్లి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నిర్భయ దోషులను ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు కొత్త తేదీని ఖరారు చేసింది. మార్చి 3న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని తిహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారి ఉరిపై కొత్త తేదీని ప్రకటించవచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో... ఢిల్లీ ప్రభుత్వం, నిర్భయ తల్లిదండ్రులు ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా సోమవారం విచారణ జరిపారు. నిందితుల్లో ఒకడైన పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దోషులందరిలో న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోనిది పవన్‌ ఒక్కడే. అతడు ఇంతవరకు క్యూరేటివ్‌ పిటిషన్‌, రాష్ట్రపతి క్షమాభిక్ష ఏదీ కోరలేదు. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్షను కోరనున్నట్లు అతని తరఫు న్యాయవాది చెప్పారు. మరో దోషి వినయ్‌ శర్మకు న్యాయపరమైన అవకాశాలు ముగియడంతో అతడు నిరాహార దీక్షకు దిగాడు. అయితే దోషులు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కొత్త డెత్‌ వారెంట్‌ను జారీ చేసింది. మార్చి 3న ఉరితీయాలని తిహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దోషలను ఉరి తీయడానికి ఇదైనా ఆఖరు తేదీ అవుతుందని ఆశపడుతున్నట్లు ఆమె చెప్పారు. 



ఇప్పటికే రెండు సార్లు వాయిదా 

నిర్భయ దోషులకు ఉరి తేదీని ప్రకటించడం ఇది మూడో సారి. న్యాయపరమైన అంశాల కారణంగా గతంలో రెండు సార్లు ఉరి అమలు వాయిదా పడింది. కోర్టు ఉరితీత తేదీని ప్రకటించడం.. చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి  వాయిదా పడుతూ వస్తోంది. మొదట కోర్టు జనవరి 22నే దోషులను ఉరి తీయాలని ఆదేశించింది. ముఖేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌తో అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఉరితీతకు రెండు రోజుల ముందు జనవరి 31న దోషులు మళ్లీ  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్ని న్యాయపరమైన అంశాలను వినియోగించుకునే వరకు ఉరి తీయరాదని కోరారు. దీంతో ఉరిశిక్ష అమలుపై కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని తేల్చి చెప్పింది. శిక్ష అమలుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్చి 3వ తేదీని ప్రకటించారు.



వినయ్‌ శర్మ నిరాహార దీక్ష

తనకున్న న్యాయపరమైన అవకాశాలన్నీ ముగియడంతో ఉరిని వాయిదా వేసేందుకు వినయ్‌శర్మ తిహార్‌ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. తన క్లైంట్‌పై జైల్లో దాడి జరిగిందని, అతని తలకు గాయాలయ్యాయని వినయ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఈ సమయంలో అతన్ని ఉరితీయద్దని కోరారు. దీంతో వినయ్‌ను చట్ట ప్రకారం జాగ్రత్తగా చూసుకోవాలని, అతని పట్ల తగినంత శ్రద్ధ వహించాలని అధికారులకు కోర్టు సూచించింది.

Updated Date - 2020-02-18T08:11:44+05:30 IST