Abn logo
Sep 23 2021 @ 03:44AM

చచ్చిపో.. చచ్చిపో

  • భర్త కళ్లెదుటే.. ఉరి వేసుకున్న భార్య
  • వీడియో తీస్తూ.. భర్త పైశాచికానందం


ఆత్మకూరు, సెప్టెంబరు 22: మంగళవారం రాత్రి. అతను బాగా తాగొచ్చాడు. భార్యను తిట్టడం మొదలెట్టాడు. ఆ సూటిపోటి మాటలు భరించలేక ఉరేసుకుని చచ్చిపోతానని హెచ్చరికగా అన్నది. ‘ఏసుకో.. ఉరేసుకో.. నీ ఒంటి మీద చేయి కూడా వెయ్యను. నిన్న ఆపనైనా ఆపను’ అన్నాడు. అంతే.. ఆమె అన్నంత పనీ చేసింది. ఓ చీర తీసుకొచ్చి ఫ్యానుకు కట్టింది. రెండో కొసను మెడకు కట్టుకుంది. బలవంతంగా కిందకు వేలాడింది. దీన్నంతా అతను వీడియో తీస్తున్నాడేగానీ... ఆపేందుకు అడుగు ముందుకు కూడా వేయలేదు. బలంగా కిందకు వేలాడుతూ.. విలవిల్లాడుతూ.. భర్త చూస్తుండగానే ఆమె నిర్జీవంగా మారిపోయింది. అప్పటికి తేరుకున్న అతడు.. తన మిత్రుడి సహాయంతో భార్యను ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు చచ్చిపోయిందని చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జేఆర్‌పేట చివరి లైనులో నివాసముంటున్న మొద్దు పెంచలయ్య, మొద్దు కొండమ్మ(30)లకు కొన్నేళ్ల కిందట వివాహమైంది.


వారికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. పెంచలయ్య బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా, కొండమ్మ మెప్మా కార్యాలయంలో రిసోర్స్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తోంది. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుమానాలు పొడచూపాయి. మద్యానికి కూడా బానిస అయిన పెంచలయ్య నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. మంగళవారం రాత్రి అతడి వేధింపులు శ్రుతిమించడటంతో ఆమె చచ్చిపోతానని బెదిరించింది. అతను వెటకారమాడాడుగానీ.. వద్దని వారించలేదు. ఆమె ఉరివేసుకుంటుంటే.. వీడియో తీస్తూ.. చచ్చిపో.. చచ్చిపో అంటూ పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండమ్మ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...