Abn logo
Sep 27 2020 @ 11:50AM

‘యాంటీ వైరల్‌’ దుస్తులు వచ్చేస్తున్నాయి!

Kaakateeya

మాస్క్‌, శానిటైజర్‌, హ్యాండ్‌ వాష్‌... ‘కొవిడ్‌ 19’ కారణంగా వీటితో సహజీవనం తప్పడం లేదు. కరోనా రాకుండా తమను తాము కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ మహమ్మారిని అరికట్టే ‘యాంటీ వైరల్‌’ దుస్తులు వస్తున్నాయంటే... ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది. భవిష్యత్తులో అలాంటి దుస్తులు మార్కెట్‌ను ముంచెత్తడానికి సిద్ధం అవుతున్నాయి.


ట్రెండ్‌

ఢిల్లీకి చెందిన బిజినెస్‌మ్యాన్‌ 36 ఏళ్ల మణిందర్‌ సింగ్‌ నయ్యర్‌ను ఇంటర్‌నెట్‌లో ఒక వీడియో ఆకర్షించింది. ‘కొవిడ్‌ 19’ నుంచి బయటపడిన ఆయన యాంటీవైరల్‌తో తయారైన ‘కోవెస్ట్‌’ స్మార్ట్‌ జాకెట్‌ను చూడగానే ఆర్డర్‌ ఇచ్చాడు. కేవలం జాకెట్‌లే కాదు... రకరకాల వైరస్‌ల బారిన పడకుండా రక్షణ కవచంలా మారే ఇలాంటి ‘యాంటీ వైరల్‌’ దుస్తులను కూడా సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు.

సాంకేతిక ‘కళ’బోత!

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఏ చిన్న మార్పునైనా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న జనం కోసం... మార్కెట్‌ వర్గాలు రకరకాల వ్యాపార ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’ (ఎన్‌ఐడి) మాజీ ప్రొఫెసర్‌, ‘క్రాఫ్ట్స్‌ విలేజ్‌ అండ్‌ ఇండియా క్రాఫ్ట్‌ వీక్‌’ సహ వ్యవస్థాపకుడైన సోమేశ్‌ సింగ్‌ చేసిన బృహత్తర ప్రయత్నమే ‘కోవెస్ట్‌’ జాకెట్‌. దీనికి శరీర ఉష్ణోగ్రతకు సంబంధించిన డిస్‌ప్లే ఉంటుంది. ఈ జాకెట్‌ను ధరిస్తే దీనిలోని ఎస్‌డీ ప్లస్‌ సెన్సర్‌ టెక్నాలజీ వల్ల ఎవరైనా రెండు మీటర్ల దూరంలో ఉండగానే మనల్ని అలర్ట్‌ చేస్తుంది. దీనికున్న ప్యాకెట్లు ఫోన్‌, వాచీ, రింగులు మొదలైనవాటిని శానిటైజ్‌ కూడా చేస్తాయి. ఈ కోవెస్ట్‌ రూపకల్పనలో ఎన్‌9 ఎక్స్‌టీఎస్‌-18 (ఒక రకమైన శానిటైజర్‌ మిశ్రమం) అనే స్విస్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల దుస్తుల పైభాగం శానిటైజ్‌తో కూడి ఉంటుంది. ఫలితంగా దీనిని ధరిస్తే వైరస్‌, బ్యాక్టీరియాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అరోమాథెరపీ ద్వారా చక్కని సువాసనలు కూడా వెదజల్లుతుంది. అలాగే జాకెట్‌ కాలర్‌లో ఫేస్‌మాస్క్‌ ఉంటుంది. ఇది ఈ నెలాఖరులో రిటైల్‌ మార్కెట్లోకి వస్తుంది. క్యాజువల్‌, ఫార్మల్‌, ఎథ్నిక్‌... ఇలా మూడు వేరియంట్లలో లభించే దీని ధర సుమారుగా రూ.5 వేలు ఉండొచ్చని అంటున్నారు. 

బెడ్‌షీట్స్‌ కూడా...

కేవలం ‘యాంటీ వైరల్‌’ దుస్తులే కాదు... ఇళ్లలో బెడ్‌షీట్స్‌ను కూడా తయారుచేస్తున్నారు. యాంటీ మైక్రోబియల్‌ బెడ్‌షీట్స్‌ అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయని చెబుతున్నారు. ‘‘స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రత్యేకమైన రసాయనాలతో ఫ్యాబ్రిక్‌ను ట్రీట్‌ చేసిన తర్వాత బెడ్‌ షీట్స్‌ను రూపొందిస్తున్నాం. 15 ఉతుకుల వరకు కూడా వాటి ప్రభావం అలాగే ఉంటుంది’’ అంటున్నారు ‘శ్వాస్‌’ సహ వ్యవస్థాపకులు సుధా ఆనంద్‌. కాటన్‌ శాటిన్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ ప్రత్యేక దుప్పట్ల ధర సుమారుగా మూడువేల రూపాయలు ఉంటుంది. వీటిని చల్లటి నీళ్లలో మాత్రమే ఉతకాల్సి ఉంటుంది. పీపీఈ కిట్స్‌తో కరోనా బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని ధరించాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. దీనిని గమనించిన ‘నానో కెమిక్స్‌’ సీఈవో సాశా బోస్‌ ‘నానో టెక్నాలజీ’తో సరికొత్త ‘జంప్‌సూట్‌’కు రూపకల్పన చేశారు. వీటిని ధరిస్తే చెమటలు పట్టకుండా హాయిగా ఉండొచ్చు. పైగా పీపీఈ కిట్లలాగా కాకుండా ఈ ‘జంప్‌సూట్‌’ను 30 సార్లు వాడొచ్చు. 

Advertisement
Advertisement
Advertisement