హంద్రీ నీవా నీళ్లు అనంతపురంలో వాడేస్తున్నారు

ABN , First Publish Date - 2022-05-20T07:33:14+05:30 IST

అనంతపురం జిల్లాలో హంద్రీనీవా జలాలు వాడేస్తుండటంతో జిల్లాకు రావాల్సిన వాటా జలాలు రావడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

హంద్రీ నీవా నీళ్లు అనంతపురంలో వాడేస్తున్నారు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

చిత్తూరు, ఆంధ్రజ్యోతి/చిత్తూరు కలెక్టరేట్‌, మే 19: అనంతపురం జిల్లాలో హంద్రీనీవా జలాలు వాడేస్తుండటంతో జిల్లాకు రావాల్సిన వాటా జలాలు రావడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దీనివల్ల రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా ఇక్కడ సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. చిత్తూరులో గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉషశ్రీచరణ్‌ (అనంతపురం జిల్లా) అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమీక్షా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జూన్‌ 30 నుంచి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పూతలపట్టు నియోజకవర్గంలో క్రిష్ణరాజసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి నెలరోజుల్టోగా  డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. మాగుంటపల్లె ప్రాజెక్టుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాళఖ అనుమతుల కోసం నివేదిక పంపామని చెప్పారు. కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణలో సమస్యలున్న ప్రాంతాల వివరాలను  జిల్లా యంత్రాంగానికి అందించాలని సూచించారు. జల వనరుల, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాలు పూర్తి చేయాలని సలహా ఇచ్చారు. సాగునీటి వనరులను మరింత పెంచేలా చర్యలు చేపడతామన్నారు. ఖరీ్‌ఫకు సిద్ధం కావాలని అధికారులకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉషశ్రీచరణ్‌ పిలుపునిచ్చారు. కైగల్‌ ఫాల్‌ ్స గంగమ్మశిరస్సు ట్యాంకు నిర్మాణానికి, చిత్తూరు నీవానది వెంబడి కాంక్రీట్‌ గోడ.. నీవానదిపై ఆనకట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈ విజయకుమార్‌కు సూచించారు. వర్షం సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో నీటి  నిల్వ ఉందని, ఖరీఫ్‌ సాగుకు ఢోకా లేదని కలెక్టర్‌ హరినారాయణన్‌ అభిప్రాయపడ్డారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పలు సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, జిల్లావ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.  ఈ సమావేశానికీ మీడియాను అనుమతించలేదు.


కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు 


చిత్తూరు కలెక్టరేట్‌: హంద్రీ నీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు చెందిన కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేశామని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా తట్ట మట్టిని కూడా తీయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్‌ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా తెలిసిందన్నారు. బ్రాంచ్‌ కెనాల్‌ పనులుచేస్తే వైసీపీకి మంచి పేరు వస్తుందనే  దుగ్దతో  ఆ పనులు చేయకుండా జాప్యం చేసినట్లు గుర్తించామన్నారు. సెక్షన్‌ 60-సి కింద కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చామన్నారు. అతడిని తొలగించి మరొకరికి కాంట్రాక్టు కేటాయిస్తామన్నారు. యామనూరు వద్ద కెనాల్‌ గ్రావిటిలో ఒక్క టీఎంసీ రిజర్వాయర్‌ నిర్మించేందుకు  ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. 

Updated Date - 2022-05-20T07:33:14+05:30 IST