చేనేత పరిమళించే..!

ABN , First Publish Date - 2022-08-06T08:55:06+05:30 IST

ఆ చీర సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది. ధరించిన వ్యక్తి ఎందరిలో ఉన్నా..

చేనేత పరిమళించే..!

  • సువాసనలు వెదజల్లే చీరను రూపొందించిన నేతన్న
  • కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలతో శాలువా తయారుచేసిన మరో కళాకారుడు
  • చేనేత దినోత్సవ వేళ.. సిరిసిల్ల నేతన్నల వినూత్న ఆవిష్కరణలు 

సిరిసిల్ల ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆ చీర సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది. ధరించిన వ్యక్తి ఎందరిలో ఉన్నా.. ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. అలాంటి అద్భుతమైన చీరను రూపొందించారు సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్‌. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం తను రూపొందించిన కళాకృతిని ఆవిష్కరించారాయన. సుగంధ ద్రవ్యాలను మేళవించి 5.50 మీటర్ల పొడవు, 450 గ్రాముల బరువుండే పట్టు చీరను తన చేనేత కళతో తీర్చిదిద్దారు. ఈ పట్టుచీరను ధరించిన వారికి కాస్తంత దగ్గరగా వెళితే చాలు.. అది వెదజల్లే పరిమళం కట్టిపడేస్తుంది. ఈ అపురూపమైన చీర ధర రూ.12 వేలు. దీని తయారీలోశ్రీగంధం, నాగ కేసరాలు, బిల్వ గుజ్జు, పాల సుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటమాంస, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, తుంగ దుంపలు, కస్తూరి పసుపు, ఎర్ర చందనం, గులాబీ, సంపగి, విరజాజి.. ఇలా మొత్తం 27 రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాడు. దాదాపు సంవత్సరంపాటు డ్రైవాష్‌ చేసినా.. 


ఈ చీర తన పరిమళాన్ని కోల్పోదని విజయ్‌ తెలిపారు. గతంలోనూ పలు అద్భుత ఆవిష్కరణలు చేసిన విజయ్‌.. ప్రస్తుతం బంగారు దారాల్ని ఉపయోగించి చీర తయారీ చేస్తున్నారు. ఆగస్టు 7నే రాష్ట్ర ప్రభుత్వం నేతన్న బీమా పథకం కూడా ప్రారంభిస్తుండడంతో.. మరో చేనేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలతో ఓ శాలువాను రూపొందించారు. ఈ విధంగా తమ నేతలపై ఈ నేతన్న తన కళాభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. దీన్ని కూడా ఆయన శుక్రవారమే ఆవిష్కరించారు. 1.50 మీటర్ల పొడవుతో 200 గ్రాముల బరువుండే ఈ సిల్కు శాలువాపై.. బీమా పథకం మార్గదర్శకాలు, సిరిసిల్లలోని నేతన్న విగ్రహాన్ని నేశారు. ఇందుకు ఆయన సుమారు రూ.25 వేలు ఖర్చు చేశారు. హరిప్రసాద్‌ గతంలో చిన్న చిన్న మగ్గాలను తయారు చేసి భారత్‌ నిర్మాణ్‌ సదస్సులో ప్రదర్శించారు.  ఇదే క్రమంలో మగ్గాలపై వివిధ బొమ్మలను నేశేవారు. అలాగే గతంలో అగ్గిపెట్టెలో అమరే చీర, పెద్ద సూది, ఉంగరంలో దూరే చీర లాంటి నూతన ఆవిష్కరణలు చేశారు. ఈ క్రమంలో..కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును కూడా అందుకున్నారు.  

Updated Date - 2022-08-06T08:55:06+05:30 IST