హ్యాండిచ్చారు

ABN , First Publish Date - 2022-07-29T08:21:31+05:30 IST

హ్యాండిచ్చారు

హ్యాండిచ్చారు

కాపు‘నేస్తం’ అంటూనే సమస్తం హుళక్కి!

కాపులకు రిజర్వేషన్లు పోయాయి

ప్రత్యేక పథకాలు కుదించేశారు

ఇచ్చేది అరకొర.. ఆర్భాట ప్రచారం

ఇక మిగిలింది కాపునేస్తం ఒక్కటే....

మూడేళ్లలో ఇచ్చింది రూ.1478కోట్లు

అది కూడా నేడు ఇచ్చే నగదుతో కలిపి..

కానీ రూ.10వేల కోట్లు ఇచ్చినట్టు డబ్బా

పింఛన్ల నుంచి నేతన్న నేస్తం వరకు

అన్ని పథకాలూ కాపుల ఖాతాలోకే..

ఏటా 2వేల కోట్లిస్తామని ఎన్నికల హామీ

అది నెరవేర్చలేక జగనన్న కాకి లెక్కలు

‘నేస్తా’నికి నేడు బటన్‌ నొక్కనున్న జగన్‌


ఇచ్చిన హామీని అమలుచేయలేక, చేయలేకపోయామని చెప్పలేక కాపుల సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వం లెక్కల గారడీకి తెరతీసింది. రాష్ట్రంలో అమలవుతున్న  చిన్నా పెద్దా అన్ని పథకాలనూ కాపుల ఖాతాలో వేసింది. ఆయా పథకాల్లో కాపులను వేరుచేసి, వారికి సర్వసాఽధారణంగా కలిగే లబ్ధిని కాపు సంక్షేమంగా చెప్పుకొంటోంది. పింఛన్లు, అమ్మఒడి, రైతు భరోసా చివరికి లా నేస్తం, నేతన్న నేస్తం పథకాలను కూడా కాపు సంక్షేమంలో పడేసింది. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చీరాగానే గతంలో కాపుల కోసం అమలైన అన్ని పథకాలనూ ఊడ్చేసింది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కాపు సంక్షేమం కోసం ఏటా కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తారు అని కాపులు ఆశించారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాకగానీ ఆ వేలకోట్ల లెక్కల గారడీ బయటపడలేదు. 45 నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న కాపు మహిళలకు రూ.15వేలు ఇచ్చే ‘కాపు నేస్తం’ మినహా, మిగిలినవన్నీ జగన్‌ ప్రభుత్వం రద్దు చేసేసింది. గత ప్రభుత్వంలో చేతల్లో కనిపించిన కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసింది. గత ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.700 కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఖర్చు చేసింది. ప్రధానంగా స్వయం ఉపాధి పథకానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఏటా రూ.300 కోట్లు ఖర్చుచేశారు. కాపులకు విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలు అమలుచేశారు. కాపు భవనాల నిర్మాణం ప్రారంభించారు. పోటీపరీక్షలకు ఉచిత కోచింగ్‌, మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి శిక్షణ అమలుచేశారు. వైసీపీ వచ్చాక అవన్నీ ఆవిరయ్యాయి. స్వయం ఉపాధిపై పెట్టుకున్న కాపు యువత, మహిళల ఆశలు గత మూడేళ్లలో మృగ్యమయ్యాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వయం ఉపాధి యూనిట్‌ పెట్టుకోలేకపోయారు. కాపునేస్తం కింద ఇచ్చే రూ.15వేలు ఎందుకూ సరిపోక, స్వయంఉపాధి పథకం లేక కాపు సంక్షేమం నిర్వీర్యమైంది.


కట్‌..కట్‌..కట్‌.. 

జగన్‌ ప్రభుత్వం రాగానే ఒక పధకం ప్రకారం కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌కింద ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. కాపు విద్యార్థుల విదేశీవిద్యకు మంగళం పాడారు. స్వయం ఉపాధి పథకం రద్దు చేశారు. ఏతావాతా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల ప్రజలకు ఒక్క పథకమే మిగిల్చారు. అదే కాపు నేస్తం. శుక్రవారం ఈ పథకానికే సీఎం జగన్‌ ఆర్భాటంగా బటన్‌నొక్కి నగదు విడుదల చేయబోతున్నారు. ఇది తప్ప కాపుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తోన్న మరో పథకం ఏదైనా ఉందా అని దుర్భిణీ వేసి వెతికినా కనిపించదు. ఎందుకంటే రూ.2వేల కోట్లతో పథకాలు అమలుచేయాల్సిన కాపు కార్పొరేషన్‌ పనేం లేక ఈగలు తోలుకుంటోంది. 


లెక్కలు చూసి షాక్‌

ఇచ్చినహామీని నిలబెట్టుకోలేకపోయినా ఏదో ఇచ్చినట్లుగా ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు చూసి కాపులు షాక్‌కు గురవుతున్నారు. ఏటా కాపునేస్తం నగదు జమచేసే రోజు ప్రభుత్వం భారీ ప్రకటనలు ఇస్తోంది. వాస్తవానికి కాపుల్లోని పేదలకు ఏడాదికి రూ.15వేలు మాత్రమే రాగా, ఈ లెక్కలు చూస్తే ఒక్కో కుటుంబానికి లక్షల్లో నగదు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రజలందరికీ ఇచ్చే పథకాలను తీసుకొచ్చి కాపు సంక్షేమంలో చూపించడంతో ఇది వేల కోట్లకు చేరింది. ఈ సంవత్సరం 3,38,792 మంది మహిళలను ప్రభుత్వం ‘కాపునేస్తం’ లబ్ధిదారులుగా గుర్తించింది. వారికి రూ.15వేల చొప్పున రూ.508కోట్లు ఖాతాల్లో జమ చేయనుంది. ఏటా జూలైలో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వ పదవీకాలం మూడేళ్లు దాటినా ఇప్పుడు మూడోసారి మాత్రమే ఈ పథకంలో నగదు వేస్తున్నారు. వచ్చే ఏడాది కూడా ఈ సమయంలోనే పథకం అమలుచేస్తే నాలుగు విడతలు అవుతుంది. అనంతరం 2024 జూలై అంటే ఎన్నికలు పూర్తవుతాయి. అంటే తన హయాంలో ఐదు విడతలుగా ఒక్కో మహిళకు రూ.75వేల సాయం చేస్తామని చెప్పి, చివరికి నాలుగు విడతలతో రూ.60వేలతో జగన్‌ సరిపెట్టపోతున్నారన్నమాట! 


నామ్‌కే వాస్తేగా చైర్మన్‌ పోస్టు

గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టు కోసం రాజకీయంగా చాలా పోటీ ఉండేది. ఏడాదికి రూ.రెండువేల కోట్లు ఇస్తారనే హామీతో ఈ ప్రభుత్వంలోనూ మొదట్లో ఎక్కువ పోటీ కనిపించింది. తొలి రెండు సంవత్సరాలు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా చేశారు. కార్పొరేషన్‌లో నిధులు, పథకాలు లేవని అర్థంకావడంతో ఆ తర్వాత నుంచి ఈ పోస్టుపై ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో విజయవాడకే చెందిన పార్టీ నేత అడపా శేషును చైర్మన్‌ను చేశారు. ఆయన కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్‌పై దృష్టిపెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. కానీ పెద్దగా పని లేకపోయినా ప్రభుత్వం కార్పొరేషన్‌ ఎండీగా ఐఏఎస్‌ అధికారిని నియమిస్తోంది. కేవలం పనిష్మెంట్‌ కిందే ఈ కార్పొరేషన్‌లో వేస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. 


నేడు ‘కాపునేస్తం’ నిధుల విడుదల

గొల్లప్రోలు, జూలై 28: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం కాపునేస్తం మూడో విడత నిధులు సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని హెలీపాడ్‌వద్ద దిగి రోడ్డు మార్గంలో పట్టణ శివారులోని ఈబీసీ కాలనీ సమీపంలోని ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభావేదిక వద్దకు ఆయన చేరుకుంటారు. అక్కడనుంచి పథకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆయన పర్యటన కోసం ఇప్పటికే హెలీపాడ్‌, సభావేదిక నిర్మాణాలు పూర్తయ్యాయి. సీఎం వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రోడ్లు సిద్ధంచేశారు. సీఎం ప్రయాణించే బస్సు గురువారం సాయంత్రం గొల్లప్రోలు చేరుకుంది. 



Updated Date - 2022-07-29T08:21:31+05:30 IST