అతిగా చేతులు కడగడం అనర్థం

ABN , First Publish Date - 2020-07-13T08:53:15+05:30 IST

కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా పలుమార్లు చేతులు శుభ్రపరుచుకోవడం, శానిటైజర్‌ వాడటం నిత్యకృత్యమైపోయింది. ఈ జాగ్రత్తల గురించి వైద్యులు, ప్రభుత్వం,

అతిగా చేతులు కడగడం అనర్థం

  • చేతుల్ని శుభ్రపరుచుకోవడానికి సబ్బులే మేలు
  • తప్పనిసరి అయితేనే శానిటైజర్‌ వాడాలి:నిపుణులు


హైదరాబాద్‌, జూలై 12: కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా పలుమార్లు చేతులు శుభ్రపరుచుకోవడం, శానిటైజర్‌ వాడటం నిత్యకృత్యమైపోయింది. ఈ జాగ్రత్తల గురించి వైద్యులు, ప్రభుత్వం, ప్రచార మాధ్యమాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి.  కొందరు  కరోనా గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఈ జాగ్రత్తలను అతిగా పాటిస్తున్నారు. ఇది శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనుచిత భయంతో అవసరాన్ని మించి ఏదైనా అతిగా చేయడం మానసిక రుగ్మతేనని వైద్య పరిభాషలో దాన్ని ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌’ (ఓసీడి) అంటారని వారు తెలిపారు. ‘‘చేతులు కడుక్కోవడం మంచిదే అయినా అదేపనిగా కడగడం తగదు. చేతులు గట్టిగా రుద్దుకుంటూ ఎంతసేపు, ఎన్నిసార్లు కడుక్కుంటున్నారు అనే దాన్ని బట్టి వారు ఓసీడికి గురైందీ లేనిదీ తెలుసుకోవచ్చ’’ని విన్‌విజన్‌ ఐ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సిహెచ్‌. సురేంద్రనాథ్‌ తెలిపారు. ఒసీడీకి గురయ్యే వారి సంఖ్య త క్కువే అయినా దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమన్నారు. అలా అదే ధ్యాసలో ఉంటూ చేతులు పదే పదే కడుక్కునే వాళ్లు వెంటనే మానసిక వైద్య నిపుణులను కలవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.


అవసరమైతేనే శానిటైజర్లు వాడాలి

ఇటీవలి కాలంలో చాలా మంది శానిటైజర్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చేతుల్ని శుభ్రపరుచుకోవడానికి సబ్బులే మేలని, వాటితో ఎన్నిసార్లైనా కడుక్కోవచ్చని, అవసరమైతే తప్ప శానిటైజర్లు వినియోగించకపోవడం మంచిదని డాక్టర్‌ సురేంద్రనాథ్‌ అన్నారు. ప్రయాణం, షాషింగ్‌ చేస్తున్నప్పుడు, ఆటలాడుతున్నప్పుడు, సమావేశాల్లో పాల్గొనడం వంటి కొన్ని సందర్భాలలో వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉండవు కనుక శానిటైజర్లు వాడొచ్చని, మిగిలిన సందర్భాల్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ‘‘కొంత మంది ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఏదైనా తినడానికి ముందు శానిటైజర్‌ వాడుతుంటారు. అది మంచిది కాదు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాలు తినే పదార్థాలతో పాటు కడుపులోకి చేరి వికారం కలిగించవచ్చు. దాంతో వాంతులు, విరోచనాలు కూడా కావచ్చు. అంతేకాకుండా మన శరీరానికి ఉపకరించే బాక్టీరియాని కూడా అది చంపుతుంది. దాంతో అనేక రకాలుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం’’ ఉందని డాక్టర్‌ సురేంద్రనాథ్‌ తెలిపారు. శానిటైజర్‌ అమితంగా వాడితే చర్మం బాగా పొడిబారిపోతుందని, అందులో ఉండే ఆల్కహాలే ఇందుకు కారణమని చర్మాన్ని మళ్లీ మెరుగుపరుచుకోవడానికి మాయిశ్చరైజర్లు ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.  రోజంతా రసాయనాలతో పని చేసే వారు సైతం శానిటైజర్లను వాడకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గాఢత కలిగిన రసాయనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని చేసేవారు ప్రత్యేకంగా దూరంగా ఉండాలి. రసాయనాలు, లిక్విడ్‌జెల్‌ కలిస్తే శరీరానికి రెట్టింపు హానికరం. శానిటైజర్‌ ఎక్కువగా ఉపయోగించే శ్రామికుల శరీరంలో క్రిమిసంహారకాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలిందని వారు తెలిపారు.

Updated Date - 2020-07-13T08:53:15+05:30 IST