హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-09-27T06:26:32+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు జీవోనే తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు సోమవారం పెదటంట్యాడ జంక్షన్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన
సీఎం జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ అర్ధనగ్నంగా మోకాళ్లపై నిల్చొని ఆంజనేయస్వామిని వేడుకుంటున్న నాయకులు, కార్యకర్తలు

పెదగంట్యాడ, సెప్టెంబరు 26: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు జీవోనే తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు సోమవారం పెదటంట్యాడ జంక్షన్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన హెల్త్‌ యూనివర్సిటీకి మహోన్నత వ్యక్తి పేరును తొలగించడం తెలుగువారిని అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుంటిసాకులు చెప్పడం ఆపి వర్సిటీ పేరు మార్పు జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించేంత వరకు ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం బీసీ రోడ్డులోని అభయాంజనేయ ఆలయం వద్ద సీఎం జగన్‌కు కళ్లు తెరిపించి జీవోను వెనక్కి తీసుకునేలా మంచి బుద్ధి ప్రసాదించాలని అర్ధనగ్నంగా మోకాళపై వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 75వ టీడీపీ వార్డు అధ్యక్షుడు నమ్మి అప్పారావు, నాయకులు దొమ్మేటి పెరుమాళ్లు, పెద్దాడ సోమునాయుడు, శ్రీముసిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T06:26:32+05:30 IST