ఇంతకీ ఏమైనట్టు?

ABN , First Publish Date - 2020-10-23T10:52:27+05:30 IST

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అఫిలియేషన్‌ తిరస్కరణపై యాజమాన్యాలకు ముందస్తు సమాచారం లేదు.

ఇంతకీ ఏమైనట్టు?

వెబ్‌సైట్‌ డిస్‌ప్లేలో సగం జూనియర్‌ కాలేజీలే 

ఆందోళనలో ప్రైవేటు యాజమాన్యాలు 


తిరుపతి(విద్య), అక్టోబరు 22: ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అఫిలియేషన్‌ తిరస్కరణపై యాజమాన్యాలకు ముందస్తు సమాచారం లేదు. ఎందుకు తిరస్కరించారో తెలియదు.ఇంటర్‌ అడ్మిషన్ల సమయంలో వెబ్‌సైట్‌లో తమ కళాశాలలు ఉంచకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 62 ప్రభుత్వ కాలేజీలు (జనరల్‌, ఒకేషనల్‌), 13 కస్తూర్బాగాంధీ, 2 ఏపీ రెసిడెన్షియల్‌, 11 సాంఘిక, 2 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్స్‌, 3 ప్రైవేట్‌ ఎయిడెడ్‌, 18 మోడల్‌స్కూళ్లు, 3 ఇన్సెటీవ్‌ కళాశాలలతోపాటు 177 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌తో కలిపి 291 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.


వీటిలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, కలికిరి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 8 నెలలుగా మూతపడిన ఈ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ కళాశాలలన్నింటిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు బోర్డు అనుమతివ్వగా.. 177 ప్రైవేట్‌ కళాశాలల్లో 90 మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టినట్లు అధికారిక సమాచారం. బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉన్న కళాశాలలనూ వెబ్‌సైట్‌లో పెట్టలేదన్నది నిర్వాహకుల ఆరోపణ. ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లకు సమయం ఇవ్వకుండానే అఫిలియేషన్‌ తిరస్కరించడంపైనా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అఫిలియేషన్‌ తిరస్కరణపై యాజమాన్యాలకు ముందస్తు సమాచారమిచ్చి ఆపి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంటర్‌ ప్రాంతీయబోర్డు అధికారుల వద్దా స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు.


ఇదే అదనుగా వెబ్‌సైట్‌లో నమోదైన కళాశాలల యాజమాన్యాలు, టీచర్లు.. తమ అడ్మిషన్ల కోసం జోరుగా ప్రచారం సాగిస్తూ.. తమ ప్రాంతాల్లో పోటీగా ఉండి అఫిలియేషన్‌ రాని కళాశాలలపై దుష్ప్రచారం సాగిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఈ విఽధానంతో కొన్ని కళాశాలల మనుగడ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్య అందించాలంటే.. అధ్యాపకుల వేతనాలు, నిర్వహణకు కొంత ఎక్కువ ఫీజులు ఉండాలని, అన్ని కళాశాలలకు ఒకే విధమైన ఫీజు అనడం సరికాదంటున్నారు. 


కాలేజీ కోడ్‌ ఓపెన్‌ చేస్తే పూర్తి సమాచారం 

విద్యార్థి చేరాలనుకునే కళాశాల కోడ్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఓపెన్‌ చేస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారం డిస్‌ప్లే అవుతుంది. భవనం, తరగతి గదులు, అధ్యాపకులు, లేబొరేటరీ, మౌలిక వసతులు తదితరాలను పరిశీలించి.. తనకు ఇష్టమైన కళాశాలను విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు.   


ఎలాంటి రిమార్కులు అందలేదు ..- శ్రీనివాసులురెడ్డి, ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి 

జియోటాగ్‌ చేసిన కళాశాలల్లో బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటి అఫిలియేషన్‌ తిరస్కరించినట్లు సమాచారం. జీప్లస్‌-3, షెడ్లలో నిర్వహిస్తున్న కళాశాలలను వెబ్‌సైట్‌లో పెట్టలేదు. జిల్లాలో అఫిలియేషన్‌ తిరస్కరించిన కళాశాలలకు సంబంధించిన ఎలాంటి రిమార్కులు బోర్డు నుంచి మాకు అందలేదు.


Updated Date - 2020-10-23T10:52:27+05:30 IST