బావిలో సగం కాలిన మహిళ మృతదేహం... కంటనీరు పెట్టుకున్న గ్రామస్తులు... ఎవరా మహిళ.... అలాంటి స్థితిలో ఎందుకు కనిపించింది?

ABN , First Publish Date - 2021-10-05T13:25:22+05:30 IST

ఈ ఆధునిక కాలంలోనూ దేశంలో ఎక్కడో ఒకచోట నిరంతరం...

బావిలో సగం కాలిన మహిళ మృతదేహం... కంటనీరు పెట్టుకున్న గ్రామస్తులు... ఎవరా మహిళ.... అలాంటి స్థితిలో ఎందుకు కనిపించింది?

ఈ ఆధునిక కాలంలోనూ దేశంలో ఎక్కడో ఒకచోట నిరంతరం వరకట్నపు హత్యలు కనిపిస్తున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఇటువంటి ఉదంతం అందరి హృదయాలను కలచివేస్తోంది. ఒక మహిళ మృతదేహం సగం కాలిపోయిన స్థితిలో బావిలో కనిపించింది. ఈ ఘటన కోడెర్మా జిల్లాలోని జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల యోగియాటిల్లా గ్రామంలో చోటుచేసుకుంది. బావిలో తేలుతున్న మృతదేహం గురించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బావి నుంచి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత ఆ మృతదేహం రేణు దేవిదిగా గుర్తించారు.


మృతురాలి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని  అత్తింటివారే హత్య చేశారని ఆరోస్తున్నారు. కాగా ఈ ఘటన అనంతరం రేణుదేవి అత్తమామలు పరారయ్యారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం యోగియాటిల్లా నివాసి సహదేవ్ యాదవ్ కుమారుడు భూపేంద్ర యాదవ్‌తో రేణు దేవి(30)కి 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు సంసారం సవ్యంగానే నడిచింది. ఆ తర్వాత, వరకట్నంగా బైక్‌తో పాటు లక్ష రూపాయల నగదు తీసుకురావాలని రేణుపై అత్తింటివారి ఒత్తిడి ప్రారంభమయ్యింది. వీటిని ఇవ్వకపోతే భూపేంద్ర యాదవ్‌కు రెండో పెళ్లి చేస్తామని కూడా బెదిరించారు. మృతురాలి బంధువులు కట్నం ఇవ్వలేకపోయారు. 


ఈ నేపధ్యంలో భూపేంద్ర యాదవ్ తన కుటుంబ సభ్యుల మద్దతుతో హజారీబాగ్ జిల్లాలోని బర్కట్టా పరిధిలోని మాన్పూర్ నివాసి బబితా దేవిని నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లిని రేణుదేవి వ్యతిరేకించడంతో ఆమెపై వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. మృతురాలి  సోదరుడు రాజేష్ యాదవ్ పోలీస్ స్టేషన్‌లో రేణుదేవి అత్త సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. కట్నం ఇవ్వకపోతే ఇంటినుంచి రేణుదేవిని వెళ్ళగొడతామని కూడా వారు బెదిరించారని రాజేష్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అక్టోబర్ 2న రేణు అదృశ్య మయ్యిందని తన సోదరి బబిత తెలియజేసిందని రాజేష్ చెప్పారు. 




ఈ విషయమైన రేణు అత్తమామలను అడిగితే తాము రేణును వెదికేందుకు కాంట్రాక్ట్ తీసుకోలేదని  నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 4న రేణు మృతదేహం ఆమె అత్తమామల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో తేలుతున్నట్లు పంచాయితీ మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ యాదవ్‌కు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న మృతురాలి సోదరుడు రాజేష్ సోదరుడు సంఘటనా స్థలానికి  చేరుకున్నాడు. గ్రామస్తుల సహాయంతో బావి నుండి మృతదేహాన్ని వెలికితీశారు. అత్తమామలే తన సోదరిని హత్య చేశారని రాజేష్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం అత్తమామలు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-05T13:25:22+05:30 IST