సగం బెర్త్‌లు ఖాళీ!

ABN , First Publish Date - 2020-08-07T10:14:00+05:30 IST

వాల్తేరు రైల్వే డివిజన్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

సగం బెర్త్‌లు ఖాళీ!

కొవిడ్‌ ప్రభావంతో రైళ్లలో 50-60 శాతమే ఆక్యుపెన్సీ 

విశాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది నాలుగు రైళ్లే!

అయినా పూర్తిగా నిండని బోగీలు

హైదరాబాద్‌ రైళ్లలో పెద్ద సంఖ్యలో బెర్త్‌లు ఖాళీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కేంద్రం ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతున్నా వాటిలోనూ ఆక్యుపెన్సీ రేటు సగటున 50 నుంచి 60 శాతం మధ్యే ఉంటున్నది. గతంలో విశాఖ నుంచి బయలుదేరే అనేక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ 200 దాటి ఉండేది. ముఖ్యంగా విశాఖ-హైదరాబాద్‌ల మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ అయితే నెల రోజుల ముందు బుక్‌ చేసుకున్నా బెర్తు లభించేది కాదు. సాధారణంగా శని, ఆదివారాల్లో విశాఖ- హైదరాబాద్‌- విశాఖ రైళ్లకు డిమాండ్‌ అధికంగా వుంటుంది. రెండు మూడు నెలల ముందే నుంచే వెయిటింగ్‌ లిస్టు వుంటుంది. రోజూ పది నుంచి 12 రైళ్ల వరకు నడిచేవి.


కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం మూడు రైళ్లు(గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్‌) మాత్రమే నడుస్తున్నాయి. అంతర్రాష్ట్ర ప్రయాణికుల క్వారంటైన్‌ నిబంధనను కూడా ఇటీవల సడలించారు. కానీ రైళ్లలో సగం బెర్త్‌లు కూడా నిండడంలేదు. సాధారణ రోజుల్లో ఏసీ బెర్త్‌లు త్వరగా భర్తీ అయ్యేవి. ఇప్పుడు కొవిడ్‌-19 కారణంగా ప్రయాణికులు ఏసీలో ప్రయాణానికి జంకుతున్నారు. నడుస్తున్న మూడు రైళ్లలో సగం బెర్త్‌లే నిండుతున్నాయి.


విశాఖపట్నం- హైదరాబాద్‌ మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ల్లో గత రెండు నెలల నుంచి 60 నుంచి 70 శాతమే ఆక్యుపెన్సీ ఉంది. ఈ రైలులో మొత్తం సీట్లు 1,150. అందులో 40 శాతమే నిండుతున్నాయి.


సికింద్రాబాద్‌- హౌరా మధ్య నడిచే  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోను 1150 సీట్లు ఉన్నాయి. అందులో  విశాఖకు 10 శాతం కోటా కేటాయించారు. వాటిలో 40 శాతమే నిండుతున్నాయి. 


ముంబై-భువనేశ్వర్‌ మధ్య నడిచేకోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖకు 10 శాతం సీట్లు/బెర్త్‌లు కేటాయిస్తున్నారు. అందులో ఆక్యుపెన్సీ 50 శాతమే ఉంటున్నది. 


22వ తేదీన గోదావరిలో బెర్త్‌ల పరిస్థితి...

ఈ నెల 22వ తేదీ(శనివారం)న విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైళ్లు, హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే రైళ్లలో బెర్త్‌లను పరిశీలిస్తే చాలా వరకు ఖాళీలు వున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కావాల్సినన్ని బెర్త్‌లు వున్నాయి. శుక్రవారం సాయంత్రం ఐఆర్‌సీటీసీ రెయిల్‌ కనెక్ట్‌ వెబ్‌సైట్‌లో పరి శీలిస్తే.... విశాఖ నుంచి బయలుదేరే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సెకండ్‌ సిట్టింగ్‌ 202 సీట్లు, స్లీపర్‌ క్లాస్‌ 189 బెర్త్‌లు, థర్డ్‌ ఏసీ 76, సెకండ్‌ ఏసీ 28, ఫస్ట్‌ ఏసీ 12 బెర్త్‌లు ఖాళీ వున్నాయి. ఫలక్‌నుమాలో సెకండ్‌ సిట్టింగ్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్‌ ఏసీ మినహా మిగిలిన అన్ని క్లాసుల్లో బెర్త్‌లు అందుబాటులో వున్నా యి.


ఇదే తేదీన హైదరాబాద్‌లో బయలుదేరే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్‌ సిట్టింగ్‌ 238 సీట్లు, స్లీపర్‌ క్లాస్‌ 237, థర్డ్‌ ఏసీ 122, సెకండ్‌ ఏసీ 29, ఫస్ట్‌ ఏసీ 11 బెర్త్‌లు ఖాళీ వున్నాయి. ఫలక్‌నుమాలో సెకండ్‌ సిట్టింగ్‌, ఫస్ట్‌క్లాస్‌ ఒక్కొక్కటి వెయిటింగ్‌ లిస్టు వుండగా, మిగిలిన క్లాసుల్లో ఖాళీలు వున్నాయి. కోణార్క్‌లో థర్డ్‌ ఏసీలో ఖాళీలు వున్నాయి. కాగా వలస కార్మికులు తిరిగి పనుల కోసం స్వస్థలాల నుంచి ప్రధాన నగరాలకు ప్రయాణం అవుతుండడం వల్ల ఆ మాత్రం సీట్లు/ బెర్త్‌లునిండుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-08-07T10:14:00+05:30 IST