ఇంట్లోనే హెయిర్ మాస్క్‌లు

ABN , First Publish Date - 2020-06-15T18:20:16+05:30 IST

తమ పొడవాటి కేశాలను చూసి మురిసిపోని మగువలు అరుదు. కానీ ఎండలు ఎంతో సుందరమైన కేశాలను జీవ రహితంగా మార్చేస్తాయి. పట్టులాంటి కేశాలను గతంలోలా పదే పదే తాకాలన్నా తల అంతా జిడ్డుగా మారి, తెగ

ఇంట్లోనే హెయిర్ మాస్క్‌లు

ఆంధ్రజ్యోతి(15-06-2020)

తమ పొడవాటి కేశాలను చూసి మురిసిపోని మగువలు అరుదు. కానీ ఎండలు ఎంతో సుందరమైన కేశాలను జీవ రహితంగా మార్చేస్తాయి. పట్టులాంటి కేశాలను గతంలోలా పదే పదే తాకాలన్నా తల అంతా జిడ్డుగా మారి, తెగ చిరాకు పుడుతుంది. మరి ఆ సమస్య నుంచి బయటపడాలంటే, కొంచెం సమయం కేటాయించి వంటింట్లో లభించే దినుసులతో హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే చాలు అంటున్నారు కేశ నిపుణులు చాంద్‌నీ కామ్‌దార్‌.  ఆమె చెబుతున్న జుట్టు సంరక్షణ చిట్కాలివి...




చుండ్రును వదలగొడుతుంది!

చుండ్రును వదిలించడానికీ, నెత్తి మీద చర్మానికి నిగారింపు తేవడానికి నిమ్మరసం, కొబ్బరినూనె, కర్పూరం ప్యాక్‌ను ట్రై చేయండి.

 

ఒక నిమ్మకాయను కోసి గిన్నెలో రసం పిండుకోండి.

  

దానికి నాలుగైదు టేబుల్‌ స్పూన్లు కొబ్బరినూనె కలపండి.


అందులో కర్పూరం పొడి వేసి పూర్తిగా కరిగేదాకా కలపండి. 


ఈ మాస్క్‌ను తలపైన చర్మానికి రాసి వేళ్లతో మృదువుగా, గుండ్రంగా తిప్పుతూ మర్దన చేయండి.  


వెచ్చటి టవల్‌ను తలపైన చుట్టండి. దీనివల్ల చర్మ రంధ్రాల ద్వారా  నూనె లోపలకంటా ఇంకుతుంది. అరగంట పాటు అలానే ఉంచాలి. 


తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్‌ప్యాక్‌ మాడు భాగానికి తగినంత తేమ అందించి, దురదను దూరం చేస్తుంది. వెంట్రుకలు రాలిపోవడాన్ని అరికడుతుంది.  




డ్రై హెయిర్‌ మునుపటిలా మెరవాలంటే...

సరైన పోషణ లేని జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది.  దీన్ని నివారించడానికి... 


బాగా మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి, గిన్నెలోకి తీసుకోండి.


అందులో ఒక టీ స్పూను తేనె, టీ ట్రీ ఆయిల్‌ కొన్ని చుక్కలు వేసి అన్నింటినీ బాగా కలపండి. 


దీన్ని నెత్తికీ, అలాగే కేశాలకు పై నుంచి కింది దాకా పట్టించండి. 


20 నిమిషాలపాటు అలాగే ఉంచి, మైల్డ్‌ షాంపూతో కడిగేయండి.


దీంతో వెంట్రుకలకు పోషణ అంది, కేశాలు తేమను నిలుపుకుంటాయి. పట్టులా మెరిసిపోతాయి. 


జిడ్డు తలకు వీడ్కోలు

వేసవిలో చెమట పోయడం వల్ల మాడు తేమగా ఉంటుంది. దీనివల్ల తలంతా దురద, జిడ్డు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందార్భాల్లో ఇది చుండ్రుకు దారి తీస్తుంది. జిడ్డును తొలగించడానికి ఈ హోమ్‌మేడ్‌ హెయిర్‌  మాస్క్‌ను వేసుకోవచ్చు.


రెండు టేబుల్‌ స్పూన్ల బేకింగ్‌ సోడాను గిన్నెలో తీసుకోవాలి. 


అందులో నాలుగు టేబుల్‌ స్పూన్ల నీరు, ఆరు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. 


ఈ మిశ్రమాన్ని తలంతటా పట్టించి, 15 నిమిషాలు అలానే ఉంచాలి.


తరువాత మైల్డ్‌ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. 


టీ ట్రీ ఆయిల్‌కు చల్లబరిచే గుణం ఉంటుంది. అది కొద్దిపాటి దురదను కలిగించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. బేకింగ్‌ సోడాలో ఉండే ఆమ్లం, అధికంగా ఉన్న నూనెను పీల్చుకొని వెంట్రుకల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

Updated Date - 2020-06-15T18:20:16+05:30 IST