ఉపాధికి ఊతమిచ్చేనా..

ABN , First Publish Date - 2022-01-29T05:36:12+05:30 IST

జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై చర్చ తెరమీదకి వచ్చింది. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో పారిశ్రామికంగా కొంత వెనుకబడి ఉన్న జిల్లాను ఈ రంగంలో కూడా ముందుకు తీసుకు వెళ్లాలన్న యోచన జిల్లా వాసుల్లో బలంగా కనిపిస్తోంది.

ఉపాధికి ఊతమిచ్చేనా..

తలనీలాల పరిశ్రమల్లో సంస్కరణలు

కొత్తగా ఊతమిచ్చేందుకు కేంద్రం చర్యలు

స్థానిక ఉపాధితో పాటు మెరుగైన ఆదాయం

అక్రమ రవాణా, ఉపాధి క్షీణతకు అడ్డుకట్ట

ఈ దిశగానే కేంద్ర మంత్రులకు నివేదిక

చొరవ తీసుకున్న ఎంపీ కోటగిరి 


ఏలూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై చర్చ తెరమీదకి వచ్చింది. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో పారిశ్రామికంగా కొంత వెనుకబడి ఉన్న జిల్లాను ఈ రంగంలో కూడా ముందుకు తీసుకు వెళ్లాలన్న యోచన జిల్లా వాసుల్లో బలంగా కనిపిస్తోంది. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు జిల్లాలో ఎక్కువగా లభించే తలనీలాల (ముడి వెంట్రుకల)ను ఆధారం చేసుకుని ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటిదాకా పారిశ్రామికంగా ఏమాత్రం ఎదుగుదల లేని ఈ జిల్లాలో ఒక వైపు తలనీలాల పరిశ్రమలు, మరోవైపు జూట్‌ మిల్లు వంటి పరిశ్రమలు స్థానికంగా వేల మందికి ఉపాధినిస్తున్నాయి. తలనీలాల పరిశ్ర మకు సరికొత్త ప్రోత్సాహం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనుసరిస్తున్న పాత పద్ధతుల స్థానంలో నవీకరణ చేసేందుకు యత్నాలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే జూట్‌ మిల్లులో అనిశ్చిత పరిస్థితి నెలకొని మూలన పడడడంతో వేల మంది వీధిన పడ్డారు. మరో మార్గం లేక వందల కుటుంబాలు అల్లాడి పోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే స్థానికంగా ఉపాధి కల్పించే తల నీలాల పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా కేంద్రం అడుగులు వేయడం ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. తలనీలాల పరిశ్రమకు ప్రోత్సాహమిచ్చే దిశగా ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. ఈ రంగంలో చేయదగ్గ, చేయూతనిచ్చే అనేక అంశాలను ఇటీవల ఆయన కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ పరిశ్రమలో సరికొత్త సంస్కరణలు ఆరంభిస్తే ఫలితాలు ప్రజానుకూలంగా ఉంటాయని ఆయన నివేదిక రూపంలో సంబంధిత కేంద్ర మంత్రులకు సమర్పించారు. 


 వేల మందికి ఉపాధి

జిల్లాలో ద్వారకా తిరుమల, ఏలూరు, తణుకు ప్రాంతాల్లో తలనీలాల పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌కు ఎంపీ కోటగిరి గురువారం దీనికి సంబంధించిన నివేదిక అంజేశారు. దేశం నుంచి అక్రమంగా తరలిస్తున్న తలనీలాలను అడ్డుకుని స్థానికంగా వాటిని ప్రాసెసింగ్‌ చేస్తే కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అంచనా వేశారు. అదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆలోచన గనుక కార్యరూపం దాలిస్తే జిల్లాలో సుమారు 20 నుంచి 30 వేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా దేశానికి కొన్ని వందల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదాయంగా వస్తుందని  కేంద్ర మంత్రికి వివరించారు. ప్రపంచంలోనే ముడి వెంట్రుకలు లభించే అతిపెద్ద దేశం భారత దేశమని, కిందటేడాది వెంట్రుకల ఎగుమతి ద్వారా దేశానికి సుమారుగా రూ. 1,904 కోట్ల ఆదాయం రాగా అది ఈ ఏడాది రూ.2,751 కోట్లకు పెరిగిందని వివరించారు. ఇవే వెంట్రుకలను ఇక్కడే ప్రాసెస్‌ చేసి విగ్గులు, తదితరాలు తయారు చేస్తే కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నారు. ప్రపంచంలో తయారయ్యే విగ్గుల్లో 99 శాతం భారత దేశం నుంచి సేకరించిన ముడి వెంట్రుకలతోనే తయారవుతున్నాయని ఉత్తరాది రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్న మయన్మార్‌, బంగ్లాదేశ్‌లకు కారు చౌకగా ముడి వెంట్రుకలను విక్రయిస్తుంటే వాటిని ప్రాసెస్‌ చేసిన వారు తిరిగి వాటిని 10 రెట్ల ఎక్కువ ధరకు మనకే అమ్ముతున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముడి వెంట్రుకలను అక్రమంగా విదేశాలకు తరలించ కుండా నిషేధం విధించాలని మంత్రిని కోరారు. వెంట్రుకల అక్రమ తరలింపు కారణంగా ఏలూరు నియోజకవర్గం పరిధిలోని ద్వారకా తిరుమల, తణుకులలో గడిచిన ఆరేళ్లలో దాదాపు 20 వేల మంది ఉపాధిని కోల్పోయారని వివరించారు. 


Updated Date - 2022-01-29T05:36:12+05:30 IST