వడగండ్లవాన బీభత్సం

ABN , First Publish Date - 2021-04-21T06:43:36+05:30 IST

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షంతో సుమారు 200 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది.

వడగండ్లవాన బీభత్సం
గాలివాన బీభత్సానికి చౌటుప్పల్‌లో నేలకొరిగిన మహావృక్షం

చౌటుప్పల్‌లో కురిసిన వడ గండ్లు, నేలకొరిగిన వరిపంట

1000 ఎకరాల్లో పంట నష్టం 

విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్థంభాలు

చౌటుప్పల్‌ టౌన్‌/చౌటుప్పల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షంతో సుమారు 200 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. గంటసేపు కురిసిన ఈదుగాలుల వానతో చెట్లు, విద్యుత్‌ స్థంబాలు నేలకొరిగాయి. మట్టిరోడ్లు తెగి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మునిసిపాలిటీలోని చౌటుప్పల్‌, లక్కారం, లింగోజీగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ధాన్యం రాశులు తడిసిపోవడంతోపాటు కొన్ని రాశులు వరదలో కొట్టుకుపోయాయి. దీంతో రైతులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. రెండు, మూడు రోజుల్లో కోయనున్న వరిపంటకు తీవ్రనష్టం జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వడగండ్లవానతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వడగండ్ల దెబ్బతిన్న పంటలు, ప్రాంతాలను చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి, నష్టాలను పరిశీలించారు. 


రైతులకు తీవ్ర నష్టం

చౌటుప్పల్‌ మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతకు తీవ్రనష్టం మిగిల్చింది. వడగళ్లతో పెద్దకొండూరు, చిన్నకొండూరు, మందోళ్లగూడెం, తూర్పుగూడెం, నేలపట్ల తదితర గ్రామాల్లో సుమారు 800ఎకరాల్లో వరపంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం తడిసిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నకొండూరులో కోళ్లఫాం కూలి, నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. 

 

Updated Date - 2021-04-21T06:43:36+05:30 IST